ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,
సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..
సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 53వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.
ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.
ఓం వ్యాసదేవాయ నమః
పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో
శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి
53. ఓం గుణాతీత స్థితి ప్రదాయై నమః
అర్థం: క్షేత్ర క్షేత్రజ్ఞ జ్ఞానం గుణాతీత స్థితికి దారితీస్తుంది. శ్రీమద్భగవద్గీత, 14వ అధ్యాయమైన గుణత్రయ విభాగ యోగంలో త్రిగుణాలను గురించి, త్రిగుణాలకు అతీతమైన స్థితి గురించి తెలియజేయబడింది.
సత్త్వం రజస్తమ ఇతి
గుణాః ప్రకృతిసంభవాః ।
నిబధ్నంతి మహాబాహో
దేహే దేహినమవ్యయమ్ ॥ 14.5
ప్రకృతి వలన పుట్టిన సత్త్వ, రజో, తమో గుణాలు దేహిని దేహమునందు బంధిస్తున్నాయి. దేహి (దేహంలోని ఆత్మ) నాశనం లేనివాడు, నిత్యుడు.
సత్త్వగుణం నిర్మలమైనది, ప్రకాశవంతమైనది, ఉపద్రవం లేనిది. అది సుఖం పట్ల ఆసక్తి చేత, జ్ఞానం పట్ల ఆసక్తిచేత జీవుడిని బంధిస్తుంది.
రజోగుణం దృశ్య విషయాలపై ప్రీతిని కలుగజేస్తుంది. కోరికను, ఆసక్తిని కలుగజేస్తుంది. అది కర్మములందలి ఆసక్తిచేత ఆత్మను బంధిస్తుంది.
తమోగుణం అజ్ఞానం నుండి పుట్టింది. అది మోహం కలుగజేస్తుంది. అది మరపు, పరాకు, సోమరితనము, అతినిద్ర మొదలగు వాటిచేత ఆత్మను బంధిస్తుంది. మొత్తం మీద ఈ మూడు గుణాలూ బంధ హేతువులే.
సాత్త్విక కర్మలకు ఫలం నిర్మలమైన సుఖం. రాజస కర్మలకు ఫలం దుఃఖం. తామస కర్మలకు ఫలం అజ్ఞానం. జీవుడు దేహోత్పత్తికి / జన్మ పరంపరకు కారణాలైన ఈ మూడు గుణాలను దాటినప్పుడు దుఃఖం, వృద్ధాప్యం, చావు పుట్టుకలు అనే వాటినుండి విముక్తుడై మోక్షాన్ని పొందుతున్నాడని భగవద్గీత చెపుతుంది.
త్రిగుణాలలో పడిపోయి నా స్వభావాన్ని కోల్పోయిన నాకు గుణాతీతస్థితిని ప్రసాదించిన నా తల్లి గీతామాతకు ధన్యవాదంతో నమస్కరిస్తున్నాను.
ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు
లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ
జై గురుదేవ్
నామం 44: Bhagavad Gita: హితకరమైన కోరికలతో జీవిస్తే ఫలితం తప్పదు.. గీతా సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -44!
నామం 41 : Bhagavad Gita: జననం మరణం అనివార్యం.. ఇది తెలిసినవాడు శోకించడు... కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -41!
నామం 40 : Bhagavad Gita: అహం బ్రహ్మాస్మి.. మనిషి నుంచి పరమాత్మ వైపు ఆత్మయాత్ర.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 40!
నామం 36 : Bhagavad Gita :సుఖం ఉన్నంత మాత్రాన శాంతి ఉండదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -36!