బంగాళాఖాతంలో మోంథా అనే అతి తీవ్ర తుఫాన్ రూపుదిద్దుకోబోతోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం ఈ మధ్యాహ్నం నాటికి వాయుగుండంగా మారనుంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి తీవ్రమైన వాయుగుండంగా బలపడనుంది. సోమవారం నాటికి నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతాల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) ప్రకటించింది.
ఈ తుఫాన్‌కు “మోంథా” అనే పేరు థాయ్‌లాండ్ సూచించింది. థాయ్ భాషలో “మోంథా” అంటే సువాసన లేదా అందమైన పువ్వు అనే అర్థం. తుఫాన్లకు పేర్లు ఇవ్వడం వల్ల వాటిని గుర్తించడం, ట్రాక్ చేయడం సులభమవుతుంది. భారత్, బంగ్లాదేశ్, ఇరాన్, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, సౌదీ అరేబియా వంటి 13 దేశాలు కలసి తుఫాన్ల పేర్లను నిర్ణయించే ప్యానెల్‌లో భాగమని అధికారులు తెలిపారు.
మోంథా ప్రభావం దక్షిణ భారత రాష్ట్రాలపై గణనీయంగా ఉండనుంది. అక్టోబర్ 27వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. తమిళనాడు తీరప్రాంత జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఏపీ తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
చెన్నై వాతావరణ కేంద్రం ప్రకారం, అక్టోబర్ 26 నుండి 29 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. ఈ కాలంలో సముద్రం ఉధృతంగా ఉండే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని ఐఎండీ హెచ్చరించింది.
అక్టోబర్ 24 సాయంత్రం నాటికి సముద్రంలో ఉన్న మత్స్యకారులు తీరానికి చేరుకోవాలని అధికారులు ఆదేశించారు. సముద్ర గాలులు తీవ్రంగా వీస్తాయని, తీర ప్రాంతాల్లో అలలు ఉధృతంగా ఉంటాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటూ, అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బలగాలను సిద్ధంగా ఉంచినట్లు సమాచారం.