రాష్ట్రంలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ దాదాపు పూర్తయింది. రిజర్వేషన్ల విధానాలపై ప్రభుత్వం జారీ చేసిన జీవో–46 ఆధారంగా జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎంపీడీవోలు వేగంగా కేటాయింపు ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎక్కడైనా రోటేషన్ సాధ్యం కాకపోతే రాజకీయ పార్టీలు సమక్షంలో లాటరీ ద్వారా రిజర్వేషన్లు నిర్ణయించే విధానం కూడా అమల్లో ఉంది. ఆదివారం రాత్రికల్లా అన్ని జిల్లాల్లో రిజర్వేషన్ల కేటాయింపు పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ రిజర్వేషన్లను ప్రకటించే గెజిట్ నోటిఫికేషన్లు కూడా త్వరలో విడుదల కానున్నాయి. ఎస్టీ, ఎస్సీ, బీసీల రిజర్వేషన్ల శాతం 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నిర్ణయించబడుతుంది. ఈసారి ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. సర్పంచుల రిజర్వేషన్లలో 2019 ఎన్నికల్లో రిజర్వ్ చేసిన స్థానాలను మార్చి కొత్త స్థానాలను రోటేషన్ పద్ధతిలో రిజర్వ్ చేస్తారు.
ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లకు 2011 జనాభా లెక్కలనే ఆధారంగా తీసుకుంటారు. అయితే బీసీ రిజర్వేషన్లకు ప్రత్యేకంగా 2024 కులగణన జనాభా ఆధారంగా కేటాయింపులు జరుగుతున్నాయి. వార్డు సభ్యుల రిజర్వేషన్ల విషయంలో మాత్రం ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాల మొత్తానికి 2024 కులగణనను పూర్ణంగా ఉపయోగిస్తారు. ఈ విధానం రిజర్వేషన్లను మరింత పారదర్శకంగా చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
షెడ్యూల్డ్ ఏరియాల్లో రిజర్వేషన్ల నియమాలు కొంత భిన్నంగా ఉంటాయి. ఎస్టీల జనాభా 50% కంటే తక్కువ కాకూడదనే నిబంధనను ఖచ్చితంగా పాటిస్తారు. ఇవి ఐదో షెడ్యూల్ ప్రాంతాలు కావడంతో సర్పంచి స్థానాలు పూర్తిగా ఎస్టీలకే రిజర్వ్ చేస్తారు. 100% ఎస్టీ జనాభా గల గ్రామాల్లో అన్ని వార్డులు మరియు సర్పంచి పదవులు ఎస్టీలకే కేటాయించాలి.
జనాభా నిష్పత్తి ఆధారంగా మొదట ఎస్టీ స్థానాలు, ఆపై ఎస్సీ, తర్వాత బీసీ రిజర్వేషన్లు కేటాయిస్తారు. తరువాత మిగిలిన స్థానాలు సాధారణ వర్గంగా పరిగణించబడతాయి. అన్ని వర్గాల్లో సగం స్థానాలను మహిళలకు రిజర్వ్ చేస్తారు. అవసరమైన చోట లాటరీ విధానం అమలులో ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తైన వెంటనే రిజర్వేషన్ల గెజిట్ నోటిఫికేషన్లు విడుదలవుతాయి. తర్వాతే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి మార్గం సుగమమవుతుంది.