Production No 23: చలనచిత్ర రంగంలో దిగ్గజ దర్శకుడు మణిరత్నం మార్క్ అంటేనే ప్రత్యేకం. ఆయన సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చిందంటే చాలు ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆసక్తి నెలకొంటుంది. తాజాగా మణిరత్నం తన తదుపరి చిత్రం గురించి అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఒక స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కనున్న ఈ సినిమాలో 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించబోతున్నారు. మణిరత్నం మార్క్ రొమాంటిక్ డ్రామాలో ఈ ఇద్దరు టాలెంటెడ్ నటీనటులు ఎలా కనిపిస్తారో అని అభిమానులు అప్పుడే సోషల్ మీడియాలో చర్చ మొదలుపెట్టారు.
మణిరత్నం-ఏఆర్ రెహమాన్ జోడీ మళ్లీ మ్యాజిక్ చేయడానికి సిద్ధం కావడం. గత మూడు దశాబ్దాలుగా వీరిద్దరి కలయికలో వచ్చిన పాటలు ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రకటించిన ఈ "ప్రొడక్షన్ నంబర్ 23" చిత్రానికి రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించబోతున్నారు. మద్రాస్ టాకీస్ లైకా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. సోనీ మ్యూజిక్ సౌత్ ఈ సినిమా ఆడియో హక్కులను సొంతం చేసుకుంది.
విజయ్ సేతుపతికి ఇది మణిరత్నంతో రెండో సినిమా. గతంలో ఆయన 'చెక్క చివంద వానం' (నవాబ్) చిత్రంలో నటించారు. అయితే సాయి పల్లవికి మాత్రం మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశం రావడం ఇదే తొలిసారి. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సాయి పల్లవి, మణిరత్నం కథానాయికగా ఎలా మెప్పిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు కానీ, త్వరలోనే షూటింగ్ ప్రారంభించి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది.
విజయ్ సేతుపతి ఇప్పటికే పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. గతేడాది ఆయన నటించిన 'ఏస్', 'తలైవన్ తలైవి' వంటి సినిమాలు మంచి గుర్తింపు తెచ్చాయి. మరోవైపు సాయి పల్లవి కూడా బాలీవుడ్ అరంగేట్రంతో పాటు 'రామాయణ' వంటి క్రేజీ సినిమాల్లో నటిస్తోంది. మణిరత్నం గత చిత్రం 'థగ్ లైఫ్' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, ఈ కొత్త సినిమాపై ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. ఒక అందమైన ప్రేమకథగా రానున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది.
సినిమాకు సంబంధించి ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ గోప్యంగా ఉంచారు. ఏదేమైనా, మణిరత్నం దర్శకత్వం, రెహమాన్ సంగీతం, విజయ్ సేతుపతి-సాయి పల్లవిల నటన.. ఈ మూడు అంశాలు సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఏడాది ఆఖరులోనే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదలయ్యే అవకాశం ఉంది.