ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగించే ప్రముఖ ఇన్‌స్టంట్ మెస్సేజింగ్ యాప్ వాట్సప్ మరో కొత్త ఫీచర్‌ను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ముఖ్యంగా గ్రూప్ చాట్స్‌లో ఎదురయ్యే ఒక కీలక సమస్యకు పరిష్కారంగా ఈ ఫీచర్‌ను తీసుకొస్తోంది. చాలా వాట్సప్ గ్రూపుల్లో ఒకే పేరు ఉన్న సభ్యులు ఎక్కువగా ఉంటారు. అటువంటి సందర్భాల్లో ఎవరు మెస్సేజ్ పంపారో గుర్తించడం కష్టంగా మారుతుంది. ముఖ్యంగా ప్రొఫైల్ ఫొటో లేకపోతే గందరగోళం మరింత పెరుగుతుంది. పెద్ద గ్రూపుల్లో వందల మంది సభ్యులు ఉన్నప్పుడు ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే వాట్సప్ కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది.
ఈ కొత్త ఫీచర్‌కు ‘ప్రొఫైల్ ఐకాన్ ఫీచర్’గా పేరును పెట్టింది. ఈ ఫీచర్ అమల్లోకి వస్తే, వాట్సప్ గ్రూపుల్లో ప్రతి యూజర్ ప్రొఫైల్ పక్కన ఒక ప్రత్యేక ఐకాన్ కనిపిస్తుంది. దీని ద్వారా మెస్సేజ్ పంపిన వ్యక్తిని ఒక్క చూపులోనే గుర్తించవచ్చు. పేర్లు ఒకేలా ఉన్నా, ఐకాన్ ద్వారా వారి గుర్తింపు స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాదు, ప్రొఫైల్ ఐకాన్‌తో పాటు బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడే చూపించనుంది. దీంతో గ్రూప్ చాటింగ్ సమయంలో కన్ఫ్యూజన్ పూర్తిగా తగ్గే అవకాశం ఉంది.
ముఖ్యంగా ప్రొఫైల్ ఫొటో లేని యూజర్లకు డిఫాల్ట్ ఐకాన్‌ను వాట్సప్ కేటాయించనుంది. దీని వల్ల ఫొటో లేకపోయినా ప్రతి యూజర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. గ్రూప్ అడ్మిన్లు, సభ్యులు అందరూ సులువుగా పార్టిసిపెంట్స్‌ను గుర్తించగలుగుతారు. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సప్ బీటా వెర్షన్ 2.23.12.7లో అందుబాటులో ఉంది. టెస్టింగ్ దశలో భాగంగా పరిమిత యూజర్లకే ఈ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ దశలో బగ్స్‌ను గుర్తించి, వాటిని పరిష్కరించే పనిలో వాట్సప్ టీమ్ బిజీగా ఉంది.
బీటా టెస్టింగ్ పూర్తయిన తర్వాత యూజర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకొని, అవసరమైన మార్పులు చేసిన అనంతరం ఈ ఫీచర్‌ను అధికారికంగా లాంచ్ చేయనుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరికీ ఒకే సమయంలో ఈ ఫీచర్‌ను రోల్ అవుట్ చేయాలని వాట్సప్ ప్లాన్ చేస్తోంది. ఇకపోతే, వాట్సప్ ఇటీవల యూజర్ల అనుభవాన్ని మరింత మెరుగుపరచేందుకు వరుసగా కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. వీడియో కాల్స్, వాయిస్ నోట్స్‌లో మార్పులు, కొత్త ఎమోజీలు వంటి అప్‌డేట్స్‌ను ఇప్పటికే విడుదల చేసింది. ఇతర మెస్సేజింగ్ యాప్స్‌కు పోటీగా యూజర్లను ఆకట్టుకునేలా వాట్సప్ తన ప్లాట్‌ఫామ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ముందుకెళ్తోంది.