నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు ఇటీవల రాజకీయంగా, సామాజికంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మరి కొంతమంది సమర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పందిస్తూ, ఈ వ్యవహారంలో ద్వంద్వ వైఖరి కనిపిస్తోందని విమర్శలు గుప్పించారు. ఒకే తరహా వ్యాఖ్యలపై ఒకరికి చర్యలు, మరొకరికి మినహాయింపులు ఎందుకని ఆయన ప్రశ్నించారు.
కేఏ పాల్ మాట్లాడుతూ శివాజీ తన వ్యాఖ్యలపై ఇప్పటికే మహిళా కమిషన్ ముందు హాజరై క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. శివాజీ మహిళలను అవమానించాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని, మాటల ఎంపికలో తేడా జరిగిందని పాల్ పేర్కొన్నారు. తప్పు జరిగితే క్షమాపణ చెప్పడం ద్వారా విషయాన్ని ముగించాలనే సంస్కృతి ఉండాలని, కానీ దాన్ని రాజకీయ రంగు పులిమి మరింత పెద్ద వివాదంగా మార్చడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే గతంలో జరిగిన మరో ఘటనను పాల్ ప్రస్తావించారు. ఒక బహిరంగ కార్యక్రమంలో నటుడు, ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ మహిళలపై చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర విమర్శలకు గురయ్యాయని గుర్తు చేశారు. మహిళలకు సంబంధించి అనుచితంగా అర్థమయ్యేలా చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో ఎందుకు స్పష్టమైన చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఒకరి విషయంలో మాత్రం కఠినంగా స్పందించి, మరొకరి విషయంలో మౌనంగా ఉండటం సమానత్వ సూత్రాలకు విరుద్ధమని ఆయన అన్నారు.
మహిళల గౌరవం విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని కేఏ పాల్ స్పష్టం చేశారు. ఎవరు చేసినా తప్పు తప్పేనని, అదే ప్రమాణాలు అందరికీ వర్తించాలన్నారు. మహిళా కమిషన్ వంటి సంస్థలు రాజకీయ ఒత్తిడులకు లోనుకాకుండా, పూర్తిగా స్వతంత్రంగా వ్యవహరించాలని సూచించారు. మాటల స్వేచ్ఛ పేరుతో మహిళలను కించపరిచే వ్యాఖ్యలను సమర్థించలేమని, అదే సమయంలో రాజకీయ లాభనష్టాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడమూ తగదని ఆయన అభిప్రాయపడ్డారు.