ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని రైల్వే శాఖ సహాయ మంత్రి వి. సోమన్న స్పష్టం చేశారు. ఏడాదిలోనే రాష్ట్రానికి రూ.9,500 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో శనివారం జరిగిన పర్యటన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మౌలిక సదుపాయాల అభివృద్ధి సాధ్యమవుతోందని, రైల్వే రంగంలో ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
హిందూపురం సమీపంలోని సోమందేపల్లి మండలం చాకర్లపల్లిలో రూ.4 కోట్లతో అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్‌ను మంత్రి సోమన్న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత కూడా పాల్గొన్నారు. అనంతరం హిందూపురం చేరుకున్న ఆయన, ఎంపీ బీకే పార్థసారథితో కలిసి యశ్వంత్‌పురం–హైదరాబాద్ మధ్య నడిచే వందే భారత్ రైలుకు హిందూపురంలో స్టాపింగ్‌ను ప్రారంభించారు. తాలూకా స్థాయిలో వందే భారత్ రైలు ఆగడం ఇదే తొలిసారి అని, ఇది హిందూపురం ప్రజలకు ప్రధాని మోదీ అందించిన ప్రత్యేక బహుమతిగా అభివర్ణించారు.
మంత్రి సోమన్న మాట్లాడుతూ 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఏపీలో రూ.9,470 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎనిమిది వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని వెల్లడించారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 1,560 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే మార్గాల నిర్మాణం కొనసాగుతోందని చెప్పారు. రైల్వే భద్రతను పెంచే దిశగా 717 ఆర్‌ఓవీలు, ఆర్‌యూవీల నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు. ఈ పనులు ప్రయాణికుల సౌకర్యాలతో పాటు రవాణా భద్రతకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
అమృత్ భారత్ స్టేషన్ అభివృద్ధి పథకం కింద రాష్ట్రంలో 73 రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని మంత్రి వివరించారు. వీటిలో తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం, హిందూపురం, ప్రశాంతి నిలయం వంటి ముఖ్యమైన స్టేషన్లు ఉన్నాయని చెప్పారు. అలాగే రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి రైల్వే శాఖ మరిన్ని నిధులు కేటాయించిందని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రైల్వే రంగంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి సోమన్న విశ్వాసం వ్యక్తం చేశారు.