అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా 19 దేశాల ప్రజల వలస దరఖాస్తులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిర్ణయం వల్ల గ్రీన్‌కార్డ్ ఇంటర్వ్యూలు, పౌరసత్వ ప్రమాణ స్వీకారాలు, వీసా మార్పులు వంటి అనేక ప్రక్రియలు అకస్మాత్తుగా రద్దు అయ్యాయి. ఈ 19 దేశాలు గతంలో అమెరికా ట్రావెల్ బ్యాన్ జాబితాలో ఉన్నవే. అయితే భారతదేశం ఈ జాబితాలో లేదు, కాబట్టి భారత పౌరులకు ఈ నియమం ప్రభావం చూపదు.
ఈ నిలుపుదలకి కారణం, వైట్ హౌస్ దగ్గర ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యులపై జరిగిన దాడి. ఆ దాడికి పాల్పడ్డాడని అనుమానం ఉన్న ఆఫ్ఘాన్ వ్యక్తి బైడెన్ ప్రభుత్వంలో ఆశ్రయం పొందినవాడని అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వం మరింత కఠినమైన భద్రతా తనిఖీలు చేపట్టింది. పౌరసత్వం “హక్కు కాదు, ఇది ఒక ప్రత్యేక అవకాశం” అని USCIS అధికారి చెప్పారు. అందుకే పూర్తిగా వెరిఫికేషన్ అయ్యేవరకు ఎవరి దరఖాస్తులనైనా ముందుకు తీసుకెళ్లడం లేదని స్పష్టంచేశారు.
ఈ నిలుపుదల వల్ల గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూలు పెద్దఎత్తున రద్దు అయ్యాయి. అనేక రాష్ట్రాల్లో లాయర్లు చెప్పిన ప్రకారం, అభ్యర్థులు ఇంటర్వ్యూలకు వెళ్లినప్పుడు అక్కడే “మీ అపాయింట్మెంట్ నిలిపివేయబడింది” అని చెప్పి పంపించారు. అలాగే పౌరసత్వం పొందబోయే చాలా మందికి ఉన్న కార్యక్రమాలు కూడా రద్దు అయ్యాయి. ఉదాహరణకు, ఒక ఇరాన్‌కి చెందిన వైద్యుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా రద్దయిందని న్యాయవాదులు తెలిపారు.
అమెరికాలో ఇప్పటికే దాదాపు 15 లక్షలకుపైగా ఆశ్రయం దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి తోడుగా గత కొన్నేళ్లలో మంజూరైన ఆశ్రయం కేసులను కూడా ప్రభుత్వం తిరిగి పరిశీలించబోతోంది. ఈ కొత్త నిర్ణయం వల్ల ఆలస్యం మరింత పెరిగి, వలస వ్యవస్థ మొత్తం “జామ్ అవుతుందేమో” అని న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు. ఏళ్ల తరబడి ఎదురు చూశిన అపాయింట్మెంట్లు ఇప్పుడు సిస్టమ్ నుంచే తొలగిపోతున్నాయని వారు అంటున్నారు.
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు చెబుతున్న ప్రకారం, ఇది మొదటి దశ మాత్రమే. గ్రీన్‌కార్డులు ఇప్పటికే పొందినవారి కేసులు, ఆశ్రయం ఇచ్చిన పాత కేసులు, వీసా మార్పులపై కూడా కొత్త కఠిన నియమాలు రావచ్చు. అంటే, ఈ నిలుపుదల చాలాకాలం కొనసాగుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే భారతీయులకు ఈ నిర్ణయంతో ఎలాంటి ఇబ్బంది రాదని అధికారులు స్పష్టం చేశారు.