సోషల్ మీడియా పాపులారిటీని పెట్టుబడిగా మార్చుకుని ‘లక్కీ డ్రా’ల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రీల్స్, ఫాలోవర్లను అడ్డం పెట్టుకుని ప్రజల నుంచి డబ్బులు దండుకునే వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టమైన హెచ్చరిక చేశారు. శనివారం ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా స్పందించిన సీపీ, ఇలాంటి మోసాలకు పాల్పడేవారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. గతంలో బెట్టింగ్ యాప్‌ల ప్రచారం చేసిన కొందరు, ఆ అక్రమ దందాకు అడ్డుకట్ట పడటంతో ఇప్పుడు ‘లక్కీ డ్రాల’ అవతారమెత్తారని ఆయన ధ్వజమెత్తారు.
రీల్స్‌లో ఆర్భాటపు ప్రచారాలు చేస్తూ, కార్లు, ఖరీదైన బైకులు, ఇళ్లు, ప్లాట్లు, డీజే సెట్లు వంటి భారీ బహుమతులు ఇస్తామని ప్రజలకు ఎర వేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని సజ్జనార్ మండిపడ్డారు. వాస్తవంలో మాత్రం ఇవన్నీ ఫేక్ ప్రచారాలేనని, ప్రజల డబ్బుతోనే కొందరు విలాస జీవితం గడుపుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ తరహా మోసాలకు సంబంధించిన పలువురు ఇన్‌ఫ్లుయెన్సర్ల వీడియోలను సీపీ స్వయంగా ‘ఎక్స్’లో షేర్ చేయడం గమనార్హం. రీల్స్‌లో బిల్డప్ ఇచ్చి, రియాలిటీలో మాత్రం ఫ్రాడ్ చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
లక్కీ డ్రాల పేరుతో ప్రజలను మోసం చేసే వారిపై ‘ది ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (బ్యానింగ్) యాక్ట్ – 1978’ కింద కేసులు నమోదు చేస్తామని సీపీ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో వారు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లైనా, సినిమా సెలబ్రిటీలైనా సరే… చట్టానికి అతీతులు కాదని స్పష్టంగా హెచ్చరించారు. పాపులారిటీ ఉందని, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. ప్రజల నమ్మకాన్ని వాడుకుని మోసం చేయడం తీవ్రమైన నేరమని, దీన్ని పోలీసులు గంభీరంగా పరిగణిస్తున్నారని పేర్కొన్నారు.
లక్కీ డ్రాల పేరుతో ఎవరైనా మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీపీ ప్రజలను కోరారు. ఇందుకోసం డయల్ 100కు లేదా హైదరాబాద్ సిటీ పోలీస్ వాట్సాప్ నెంబర్ 9490616555కు వివరాలు పంపించాలని సూచించారు. అవసరమైతే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రజలు సోషల్ మీడియాలో కనిపించే ఆర్భాటపు ప్రకటనలకు, ఆకర్షణీయమైన ఆఫర్లకు మోసపోవద్దని, అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రీల్స్‌లో కనిపించే బిల్డప్‌కు మోసపోయి కష్టార్జితాన్ని కోల్పోకూడదని ఆయన హెచ్చరించారు.