దొంగల దందాపై పోలీసుల పంజా.. కోట్ల విలువైన సొత్తు బాధితుల చెంతకు!
విశాఖపట్నం: విశాఖ నగర పోలీసులు నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆస్తి నేరాలకు సంబంధించి ఆగస్టు నెలలో నమోదైన కేసులను ఛేదించి భారీగా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.1,13,87,040 విలువైన ఆస్తులను రికవరీ చేసి బాధితులకు తిరిగి అందజేశారు.
- ఆగస్టు నెలలో విశాఖ నగర పోలీసులు రూ.1.13 కోట్లకు పైగా విలువైన చోరీ సొత్తును రికవరీ చేశారు.
- ప్రజల్లో నేరాలపై అవగాహన కోసం క్రైమ్ వింగ్ ఆధ్వర్యంలో 472 ప్రత్యేక సదస్సులు నిర్వహించారు.
విశాఖపట్నం: విశాఖ నగర పోలీసులు నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆస్తి నేరాలకు సంబంధించి ఆగస్టు నెలలో నమోదైన కేసులను ఛేదించి భారీగా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.1,13,87,040 విలువైన ఆస్తులను రికవరీ చేసి బాధితులకు తిరిగి అందజేశారు.
నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి చేతుల మీదుగా బాధితులకు వారి పోగొట్టుకున్న సొత్తును అప్పగించారు. ఆగస్టు నెలలో ఆస్తి నేరాలకు సంబంధించి 74 కేసులను ఛేదించిన పోలీసులు.. 102 మంది నిందితులను అరెస్ట్ చేశారు.
బంగారం, వెండి, నగదు.. భారీగా రికవరీ
పోలీసులు స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తులో 796 గ్రాముల బంగారం, 9.5 కిలోల వెండి, రూ.14.75 లక్షల నగదు ఉన్నాయి. వీటితో పాటు చోరీకి గురైన 414 మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు గుర్తించి రికవరీ చేశారు. ఈ మొబైల్ ఫోన్ల విలువ సుమారు రూ.60.75 లక్షలుగా పోలీసులు వెల్లడించారు.
నిఘా పెంపునకు 661 సీసీ కెమెరాలు
విశాఖ నగరంలో నేరాలను అరికట్టేందుకు పోలీసులు సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఆగస్టు నెలలో నగరవ్యాప్తంగా కొత్తగా 661 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సీపీ శంకబ్రత బాగ్చి తెలిపారు.
అదే సమయంలో ప్రజల్లో నేరాలపై అవగాహన పెంచేందుకు క్రైమ్ వింగ్ ఆధ్వర్యంలో 472 ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించినట్లు చెప్పారు.
రికవరీలో ఆగస్టుకు ప్రత్యేక స్థానం
ఈ ఏడాదిలో ఇప్పటివరకు నెలవారీగా జరిగిన రికవరీల్లో ఆగస్టులోనే అత్యధికంగా రూ.1.13 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.
ఇక నగర పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన 26వ రికవరీ మేళా ద్వారా ఇప్పటివరకు మొత్తం రూ.26.37 కోట్ల విలువైన ఆస్తులను బాధితులకు తిరిగి అందజేసినట్లు డాక్టర్ శంకబ్రత బాగ్చి వెల్లడించారు.
Be the first to react