Veligonda Project: ఈ నెలలోనే వెలిగొండ వెలుగులు.. మూడు దశాబ్దాల కల సాకారం!

Veligonda Project: కరువు, ఫ్లోరైడ్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలకు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఈ నెలలోనే నీరు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న వెలిగొండ ప్రాజెక్టు కలను కూటమి ప్రభుత్వం సాకారం చేస్తోందని చెప్పారు.

Veligonda Project
Veligonda Project

వెలిగొండకు మోక్షం.. మూడు దశాబ్దాల కల నెరవేరబోతోంది..

వెలిగొండ ప్రాజెక్టుపై కీలక అప్‌డేట్.. ఈ నెలలోనే నీరు అందిస్తాం: మంత్రి నిమ్మల..

అమరావతి: కరువు, ఫ్లోరైడ్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలకు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఈ నెలలోనే నీరు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న వెలిగొండ ప్రాజెక్టు కలను కూటమి ప్రభుత్వం సాకారం చేస్తోందని చెప్పారు.

1996లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిందని మంత్రి గుర్తుచేశారు. ఇప్పుడు అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రాజెక్టును ప్రారంభించి, ఈ నెలలోనే నీరు అందించబోతుండటం చారిత్రక ఘట్టమని అభివర్ణించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో జలవనరుల శాఖపై నిర్వహించిన సమీక్షలో 2026 ఆగస్టు నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలని చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించారని మంత్రి తెలిపారు.

ఆ లక్ష్యానికి అనుగుణంగా గత రెండేళ్లుగా పనులను వేగవంతం చేశామని చెప్పారు. హెడ్ రెగ్యులేటర్‌కు సంబంధించిన సీసీ వాల్స్, వింగ్స్ పనులను 2026 మే నాటికి పూర్తి చేశామని వెల్లడించారు.

కృష్ణా నది నుంచి టన్నెల్‌కు నీరు చేరే మార్గంలో ఉన్న అప్రోచ్ ఛానల్ వద్ద సుమారు 80 వేల మెట్రిక్ టన్నుల మట్టిని తొలగించామని తెలిపారు. నీరు వచ్చే మార్గాన్ని కూడా ఈ ఏడాదే సిద్ధం చేశామని చెప్పారు.

వెలిగొండ టన్నెల్-2లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో సుమారు 7 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి తెలిపారు. గత రెండేళ్లలో రేయింబవళ్లు పనులు నిర్వహించి 6,907 మీటర్ల లైనింగ్‌ను పూర్తి చేశామని చెప్పారు. మిగిలిన 81 మీటర్ల పనులను మరో ఐదారు రోజుల్లో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా టన్నెల్‌లో పెండింగ్‌లో ఉన్న సుమారు 5 కిలోమీటర్ల బెంచింగ్ పనులను కూడా ఈ రెండేళ్లలో పూర్తి చేశామని మంత్రి తెలిపారు.

వెలిగొండ టన్నెల్‌లో నిలిచిపోయిన టన్నెల్ బోరింగ్ మిషన్‌ (TBM) తొలగింపు కూడా అత్యంత క్లిష్టమైన పనిగా మంత్రి వివరించారు. సుమారు 1,900 టన్నుల బరువు, 175 మీటర్ల పొడవు ఉన్న TBM తొలగింపుపై గతంలో న్యాయపరమైన సమస్యలు ఏర్పడ్డాయని చెప్పారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పట్టించుకుని పరిష్కరించారని తెలిపారు.

TBM తొలగింపు ప్రక్రియ దాదాపు పూర్తయిందని, ప్రస్తుతం సుమారు 300 టన్నుల వ్యర్థాలు మిగిలి ఉన్నాయని చెప్పారు. వాటిని మరో నాలుగు, ఐదు రోజుల్లో తొలగిస్తామని వెల్లడించారు.

వెలిగొండ ప్రాజెక్టులో మరో కీలకమైన 21 కిలోమీటర్ల ఫీడర్ కెనాల్ పనుల పరిస్థితి కూడా గతంలో దారుణంగా ఉండేదని మంత్రి తెలిపారు. ఈ కెనాల్‌ను పూర్తి చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం రూ.460 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. 2026 జనవరిలో పనులకు శంకుస్థాపన చేశామని, ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు.

వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంతో తమ భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రామానాయుడు తెలిపారు. వెలిగొండ నిర్వాసితులకు మొత్తం రూ.900 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. గత ఐదేళ్లలో వారికి ఎలాంటి చెల్లింపులు జరగలేదని మంత్రి ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 2,557 మంది నిర్వాసితులకు రూ.318 కోట్లు చెల్లించామని తెలిపారు. తాజాగా మరో 1,600 మంది నిర్వాసితులకు రూ.200 కోట్లు అందించామని వెల్లడించారు.

మిగిలిన మొత్తాన్ని కూడా ప్రాజెక్టు పూర్తితో పాటు చెల్లిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రాజెక్టు ఎంత ముఖ్యమో నిర్వాసితులు కూడా తమ ప్రభుత్వానికి అంతే ముఖ్యమని స్పష్టం చేశారు.

వెలిగొండ నిర్వాసితుల కోసం ఏర్పాటు చేస్తున్న ఏడు కాలనీల్లో నాలుగు ఇప్పటికే పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. మిగిలిన మూడు కాలనీల నిర్మాణాన్ని కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు.

వెలిగొండ ప్రాజెక్టు పనుల కోసం కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో సుమారు రూ.3,000 కోట్లు ఖర్చు చేసిందని రామానాయుడు తెలిపారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా పనులు చివరి దశకు చేరుకున్నాయని చెప్పారు. కరువు, ఫ్లోరైడ్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల జీవితాల్లో వెలిగొండ నీరు కొత్త ఆశలు నింపుతుందని పేర్కొన్నారు.

ఈ నెలలోనే వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీరు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి స్పష్టం చేశారు. మూడు దశాబ్దాలుగా సాగుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం ప్రాంతంలోని సాగు, తాగునీటి అవసరాలకు గణనీయమైన ఊరట లభించే అవకాశం ఉంది.

Tags

Be the first to react

Latest