స్వాతంత్ర్యానికి పూర్వం దేశంలోనే అతిపెద్ద జిల్లా 'విజగపటం'.. 1915 నాటి అధికారిక గెజిటీర్ వెలుగులోకి!
History Of Vizag: స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశంలోనే అతిపెద్ద జిల్లాగా విశాఖపట్నం ('విజగపటం') ఉండేదని 1915 నాటి కలెక్టర్ డబ్ల్యూ. ఫ్రాన్సిస్ రాసిన అధికారిక గెజిటీర్ ద్వారా వెల్లడైంది. నాడు ఈ జిల్లాలో మొత్తం 23 తాలూకాలు ఉండగా, ప్రస్తుతం ఒడిశాలో ఉన్న రాయగడ, కోరాపుట్, జైపూర్, మల్కన్‌గిరి, నవరంగపూర్ వంటి 9 తాలూకాలు నాటి విశాఖలోనే భాగంగా ఉండేవి. 1936లో ఒడిశా రాష్ట్ర ఆవిర్భావంతో అవి ఒడిశాలో కలిశాయి. ఆ తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, మన్యం జిల్లాలుగా విభజన జరిగి నాటి మహా విశాఖ నేడు చిన్న జిల్లాగా మారిపోయింది.
పూర్వ విశాఖపట్నం జిల్లాలో ఏకంగా 23 తాలూకాలు.. ఒడిశాలోని కీలక ప్రాంతాలన్నీ వైజాగ్‌లోనే!
రాయగడ, కోరాపుట్, జైపూర్, మల్కన్‌గిరి నాడు విశాఖ జిల్లాలోనే అంతర్భాగం!
కనుమరుగైన పురాతన తాలూకాలు.. సర్వసిద్ధి (యలమంచిలి), నాటి తొలి ఎంపీ స్థానం గొల్గొండ!
Visakhapatnam: స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశంలోనే విస్తీర్ణ పరంగా అత్యంత విశాలమైన జిల్లాగా నాటి విశాఖపట్నం (ఆ రోజుల్లో 'విజగపటం' - Vizagapatam అని పిలిచేవారు) గుర్తింపు పొందింది. ఇందుకు సంబంధించిన బలమైన ఆధారాలను నాటి 'విజగపటం డిస్ట్రిక్ట్ అఫీషియల్ గెజిటీర్' (Vizagapatam District Gazetteer) ద్వారా వెల్లడించారు. నాటి విజగపటం జిల్లా కలెక్టర్, ఐసీఎస్ (ఇండియన్ సివిల్ సర్వీస్) అధికారి డబ్ల్యూ. ఫ్రాన్సిస్ ఈ పుస్తకాన్ని ముద్రించారు. నాటి కాలంలో ఈ గెజిటీర్ వెల కేవలం రెండు రూపాయల నాలుగు అణాలు మాత్రమే.
23 తాలూకాలతో మహా సామ్రాజ్యం
ఈ గెజిటీర్‌లోని అధికారిక మ్యాప్ ప్రకారం, విజగపటం జిల్లాలో మొత్తం 23 తాలూకాలు విస్తరించి ఉండేవి. ఇందులో విశాఖపట్నం, భీమిలీపట్నం, అనకాపల్లి, విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, వీరవల్లి, పాలకొండ ప్రాంతాలు ఉండేవి. వీటితో పాటు కాలక్రమంలో కనుమరుగైపోయిన చారిత్రక తాలూకాలు 'సర్వసిద్ధి' (ప్రస్తుత అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ప్రాంతం), మరియు స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో ఎంపీ స్థానంగా ఉన్న 'గొల్గొండ' తాలూకాలు నాటి విశాఖలోనే భాగంగా ఉండేవి.
నేటి ఒడిశాలోని 9 తాలూకాలు నాటి వైజాగ్‌లోనే
విశేషమేమిటంటే, ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలో ఉన్న దాదాపు 9 ప్రధాన ప్రాంతాలు/తాలూకాలు నాడు విజగపటం జిల్లాలోనే అంతర్భాగంగా ఉండేవి. బిసంటటక్, గుణుపూర్, జైపూర్, కోరాపుట్, మల్కన్‌గిరి, నవరంగపూర్, పద్వ, పొట్టంగి, రాయగడ ప్రాంతాలన్నీ నాటి విశాఖ జిల్లా పరిధిలోనే కొనసాగేవి. ఈ సువిశాల విస్తీర్ణం కారణంగానే నాటి ఒడిశా దక్షిణ ప్రాంత ప్రజలకు, విశాఖపట్నం తెలుగు ప్రజలకు మధ్య ఇప్పటికీ బలమైన చుట్టరికాలు, విడదీయరాని రక్తసంబంధాలు, సాంస్కృతిక బంధాలు కొనసాగుతున్నాయి.
ఒడిశా విభజన నుంచి నేటి చిన్న జిల్లా వరకు
ఒడిశా ప్రత్యేక రాష్ట్ర హోదా కోరుకోవడంతో, విజగపటం జిల్లాలోని ఈ 9 తాలూకాలను ఒడిశా రాష్ట్రంలో విలీనం చేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా సౌలభ్యం కోసం ఉమ్మడి విశాఖపట్నం నుంచి తొలుత శ్రీకాకుళం, అనంతరం విజయనగరం జిల్లాలు వేరుపడ్డాయి. కాలక్రమేణా అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు (మన్యం), పార్వతీపురం మన్యం జిల్లాలుగా విడిపోయి, ఒకప్పుడు దేశంలోనే అతిపెద్ద సామ్రాజ్యంగా విలసిల్లిన విశాఖపట్నం ప్రస్తుతం ఒక చిన్న పరిపాలనా జిల్లాగా రూపాంతరం చెందింది.
Tags
Be the first to react