విశాఖలో మరో భారీ ప్రాజెక్టు.. 24 ఎకరాల్లో ‘ఆంధ్ర మండపం’! ప్రత్యేకతలివే...!
Andhra Mandapam: విశాఖపట్నంలోని కాపులుప్పాడ కొండపై 24 ఎకరాల్లో అత్యాధునిక ‘ఆంధ్ర మండపం’ కన్వెన్షన్ సెంటర్ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందులో 5 వేల మంది కూర్చునే ఆడిటోరియం, ఎగ్జిబిషన్ హాల్, 250కి పైగా గదులతో నాలుగు నక్షత్రాల హోటల్ ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
250కి పైగా హోటల్ గదులు.. భారీ ఎగ్జిబిషన్ హాల్.. విశాఖలో కొత్త ప్రాజెక్టు!
కాపులుప్పాడ కొండపై ఆంధ్ర మండపం.. ఒకే చోట ఎన్నో సదుపాయాలు!
విశాఖలో భారీ కన్వెన్షన్ సెంటర్.. నిర్మాణంపై చంద్రబాబు కీలక ఆదేశాలు!
Visakapatnam: విశాఖపట్నం నగరానికి మరో అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టు రాబోతోంది. దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపం తరహాలో విశాఖలో కూడా అత్యాధునిక సదుపాయాలతో ‘ఆంధ్ర మండపం’ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. భారీ సమావేశాలు, అంతర్జాతీయ సదస్సులు, వాణిజ్య ప్రదర్శనలు నిర్వహించేందుకు వీలుగా ఈ కన్వెన్షన్ సెంటర్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు గడువు విధించారు.
విశాఖ నగర పరిధిలోని కాపులుప్పాడ కొండపై సముద్ర మట్టానికి సుమారు 120 మీటర్ల ఎత్తులో 24 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ప్రకృతి అందాల మధ్య, సముద్ర తీరాన్ని వీక్షించేలా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (APIIC) నిర్మాణ సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించింది. అధికారులు ఏడు విభిన్న డిజైన్లతో త్రీడీ నమూనాలను కూడా సిద్ధం చేశారు.
ఈ ఆంధ్ర మండపంలో ప్రధాన ఆకర్షణగా భారీ ఆడిటోరియం ఉండనుంది. సుమారు 3.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ఆడిటోరియంలో ఒకేసారి 5 వేల మంది కూర్చునే సదుపాయం కల్పించనున్నారు. అంతర్జాతీయ సమావేశాలకు అనుగుణంగా అత్యాధునిక ఆడియో, వీడియో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఆధునిక ఇంటీరియర్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.
అలాగే సుమారు 1.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక ఎగ్జిబిషన్ హాల్‌ను నిర్మించనున్నారు. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు బస చేసేందుకు 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 250కి పైగా గదులతో కూడిన నాలుగు నక్షత్రాల హోటల్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో సమావేశాలు, ప్రదర్శనలు, వసతి సదుపాయాలు అన్నీ ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి రానున్నాయి.
ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను కూడా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ప్రణాళికలు రూపొందించారు. ప్రాంగణం వెలుపల ఉన్న 6.8 ఎకరాల స్థలంలో పూల తోటలు, వాటర్ ఫౌంటెన్లు ఏర్పాటు చేయనున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కళాఖండాలతో పాటు, సముద్ర అందాలను ఆస్వాదించేందుకు ప్రత్యేక వ్యూ పాయింట్లను అభివృద్ధి చేయనున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. పనులను వేగవంతం చేసి ఏడాదిలోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది జరగనున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) భాగస్వామ్య సదస్సును ఇదే కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే విశాఖలో అంతర్జాతీయ స్థాయి సమావేశాలు, వాణిజ్య ప్రదర్శనలు నిర్వహించేందుకు మరో ముఖ్యమైన వేదిక అందుబాటులోకి వస్తుంది.
Be the first to react