Minister Gottipati: రైతులకు శుభవార్త! సమస్య తీరినట్లే! ఇకపై వ్యవసాయం లాభదాయకం!

Minister Gottipati: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు నాణ్యమైన విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్
రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్

అభివృద్ధి, సంక్షేమంతో ఏపీని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాం: మంత్రి గొట్టిపాటి..

సోలార్ విద్యుత్‌తో సొంత అవసరాలు తీర్చుకోవాలి.. పీఎం కుసుమ్‌తో రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్..

కారంచేడులో మూడు సామాజిక నీటి శుద్ధి కేంద్రాలు ప్రారంభం.. రూ.3.50 కోట్లతో కొత్త పైపులైన్లు..

బాపట్ల: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు నాణ్యమైన విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

బాపట్ల జిల్లా కారంచేడులో సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన మూడు సామాజిక నీటి శుద్ధి కేంద్రాలను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు సహకరించిన దాతలను ఆయన అభినందించారు. ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం ఎంత ముఖ్యమో, అవి ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా నిర్వహించడం కూడా అంతే ముఖ్యమని అన్నారు.

కారంచేడులో మూడు, నాలుగు దశాబ్దాల తర్వాత నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు రూ.3.50 కోట్లతో కొత్త పైపులైన్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి చెప్పారు. పూర్తి స్థాయిలో కొత్త పైపులైన్ల నిర్మాణానికి మరో రూ.6 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు వెల్లడించారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. పెన్షన్ల పెంపు, ఉచిత బస్సు, గ్యాస్ తదితర పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు.

సామాజిక పెన్షన్ల కోసమే ప్రభుత్వం ఏడాదికి రూ.33 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోందని వెల్లడించారు. అర్హులైన వారికి త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని తెలిపారు.

ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలు, ప్రభుత్వం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించేందుకు విద్యుత్ రంగంలో మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని గొట్టిపాటి తెలిపారు.

భవిష్యత్‌లో విద్యుత్ అవసరాల కోసం ఇతర వనరులపై ఎక్కువగా ఆధారపడకుండా, మన అవసరాలకు మనమే విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. స్థానిక వనరులను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా భవిష్యత్‌లో ఎదురయ్యే ఇంధన సంక్షోభాలను అధిగమించవచ్చని అన్నారు.

రాష్ట్రంలో ఆరు లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్‌టాప్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. రూ.2 లక్షల వ్యయంతో సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.78 వేలకుపైగా సబ్సిడీ లభిస్తుందని చెప్పారు. సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీ కుటుంబాలకు కేంద్ర సబ్సిడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.20 వేల సహాయం అందిస్తుందని వివరించారు.

పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు పగటిపూట 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా సౌర విద్యుత్ పథకాలను ఉపయోగించుకోవడం ద్వారా కుటుంబాలు తమ విద్యుత్ అవసరాలను కొంతవరకు తామే తీర్చుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

విదేశాల్లో జరుగుతున్న యుద్ధాలు, ఇతర అంతర్జాతీయ పరిణామాల కారణంగా గ్యాస్, డీజిల్, పెట్రోల్ వంటి ఇంధనాల సరఫరాలో ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉండవచ్చని మంత్రి పేర్కొన్నారు.

ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కొనేందుకు మనకు అందుబాటులో ఉన్న స్థానిక వనరులను సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సూర్యఘర్ వంటి పథకాల ద్వారా మనం వినియోగించే విద్యుత్‌ను మనమే ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉందని చెప్పారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు ప్రజలు ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.

కారంచేడు కార్యక్రమాల అనంతరం మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్చూరుకు వెళ్లారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి లబ్ధిదారులకు ఎల్‌ఓసీ పత్రాలు అందజేశారు.

అనంతరం పర్చూరు మార్కెట్ యార్డులో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

సోలార్ విద్యుత్, ఆర్‌డీఎస్‌ఎస్‌, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై అధికారులతో చర్చించారు. విద్యుత్ శాఖకు సంబంధించిన అన్ని పనులను మరింత వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

5 వేల జనాభా ఉన్న గ్రామాలను గుర్తించి అక్కడ అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. లో-వోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

అవసరమైన ప్రాంతాల్లో కొత్త విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందేలా పనులను ప్రణాళికాబద్ధంగా వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమాల్లో ఎంపీలు దగ్గుబాటి పురంధేశ్వరి, తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హితేష్‌తో పాటు పలువురు అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Tags

Be the first to react

Latest