ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించే పలు ముఖ్య రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ కొత్త షెడ్యూల్ జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. అనంతపురం మీదుగా నడిచే కలబురిగి–బెంగళూరు వందేభారత్ ఎక్స్ప్రెస్, కొండవీడు ఎక్స్ప్రెస్, ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైళ్ల రాకపోకల సమయాల్లో ఈ మార్పులు చేశారు. ప్రయాణికులు ఈ తాజా వేళలను గమనించి ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
కలబురిగి నుంచి బెంగళూరు వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ (22231) ఇప్పటివరకు అనంతపురం స్టేషన్కు ఉదయం 9:28 గంటలకు చేరుకునేది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఈ రైలు ఉదయం 10:04 గంటలకు అనంతపురం చేరుకుని 10:05 గంటలకు బెంగళూరుకు బయలుదేరుతుంది. అలాగే బెంగళూరు నుంచి కలబురిగి వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ (22232) తిరుగు ప్రయాణంలో ఇకపై సాయంత్రం 5:33 గంటలకు అనంతపురం చేరుకుని 5:35 గంటలకు బయలుదేరనుంది. గతంలో ఈ రైలు 5:58 గంటలకు వచ్చేది.
కొండవీడు ఎక్స్ప్రెస్ (17212) షెడ్యూల్లో కూడా కీలక మార్పులు చేశారు. ఈ రైలు గతంలో అనంతపురానికి ఉదయం 6:38 గంటలకు చేరుకునేది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఉదయం 4:33 గంటలకు చేరుకుని 4:35 గంటలకు బయలుదేరుతుంది. అదేవిధంగా, ఇప్పటివరకు పుట్టపర్తి స్టేషన్లో సుమారు రెండు గంటల పాటు నిలిచే ఈ రైలు, ఇకపై పుట్టపర్తిలో ఆగదని అధికారులు తెలిపారు.
బెంగళూరు సిటీ నుంచి భువనేశ్వర్ వెళ్లే ప్రశాంతి ఎక్స్ప్రెస్ (18464) టైమింగ్ కూడా మార్చారు. ఈ రైలు గతంలో అనంతపురం స్టేషన్కు సాయంత్రం 6:13 గంటలకు వచ్చి 6:15 గంటలకు వెళ్లేది. తాజా షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6:28 గంటలకు చేరుకుని 6:30 గంటలకు బయలుదేరుతుంది. ఈ మూడు రైళ్లకు సంబంధించిన మారిన వేళలు అన్నీ జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి.
ఇదే సమయంలో శబరిమల యాత్రికుల సౌకర్యార్థం అనంతపురం మీదుగా ప్రత్యేక రైళ్లను కూడా నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. చర్లపల్లి నుంచి కొల్లామ్కు వెళ్లే ప్రత్యేక రైలు (07127) జనవరి 10, 17 తేదీల్లో నడుస్తుంది. ఇది అనంతపురానికి రాత్రి 7:53 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రత్యేక రైలు (07128) జనవరి 12, 19 తేదీల్లో అనంతపురానికి తెల్లవారుజామున 2:33 గంటలకు చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి ముందుగానే ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.