రాజస్థాన్‌లోని పిలానీలో ఉన్న దేశ ప్రఖ్యాత విద్యాసంస్థ బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS Pilani) 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందుకోసం నిర్వహించే బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్ (BITSAT)–2026 వివరాలను అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన స్కోర్ ఆధారంగా పిలానీ, హైదరాబాద్, కేకే బిర్లా గోవా క్యాంపస్‌లలోని ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఇంటర్మీడియట్ అర్హతతో బీఈ, బీటెక్, బీఫార్మసీ, ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందే అవకాశం ఉంటుంది.
బిట్‌శాట్–2026 పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. అభ్యర్థులు కావాలంటే రెండు సెషన్లకు హాజరయ్యే అవకాశం కల్పించారు. ఈ రెండు సెషన్లలో వచ్చిన స్కోర్లలో ఉత్తమమైన (Best Score) స్కోర్‌ను మాత్రమే ఫైనల్ మెరిట్ కోసం పరిగణనలోకి తీసుకుంటారు. ఈ విధానం వల్ల విద్యార్థులకు మరోసారి అవకాశం లభించడంతో పాటు మెరుగైన ర్యాంకు సాధించే అవకాశాలు పెరుగుతాయి. పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు.
బీఈ, ఎంఎస్సీ, బీఫార్మసీ కోర్సులకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి. బిట్స్ పిలానీతో కలిసి ఆస్ట్రేలియాలోని RMIT యూనివర్సిటీ (మెల్‌బోర్న్), అమెరికాలోని అయోవా స్టేట్ యూనివర్సిటీ (Ames, USA), యూనివర్సిటీ ఎట్ బఫెలో (న్యూయార్క్), రెన్సెలార్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్ (న్యూయార్క్), ఫ్రాన్స్‌లోని సెంట్రల్ సుపెర్లాక్ పారిస్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలతో 2+2 జాయింట్ కొలాబరేటివ్ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్‌లలో విద్యార్థులు మొదటి రెండు సంవత్సరాలు భారత్‌లోని బిట్స్ పిలానీ క్యాంపస్‌లో చదివి, మిగిలిన రెండేళ్లు ఎంపిక చేసిన విదేశీ విశ్వవిద్యాలయంలో చదివే అవకాశం ఉంటుంది.
అర్హతల విషయానికి వస్తే, అభ్యర్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లేదా బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌లో కనీసం 75 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రవేశాలు పూర్తిగా బిట్‌శాట్–2026 మెరిట్ ఆధారంగానే కల్పిస్తారు. సెషన్–1 దరఖాస్తులు డిసెంబర్ 15, 2025 నుంచి మార్చి 16, 2026 వరకు ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు. సెషన్ 1 & 2 రెండింటికీ కలిపి దరఖాస్తు రుసుము పురుష అభ్యర్థులకు రూ.5,400, మహిళా అభ్యర్థులకు రూ.4,400గా నిర్ణయించారు. సెషన్–1 పరీక్ష ఏప్రిల్ 15 నుంచి 17 వరకు, సెషన్–2 పరీక్ష మే 24 నుంచి 26 వరకు నిర్వహించనున్నారు.