ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ విద్యార్థులకు ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చారు. చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆయన సొంత నిధులతో ఆధునిక లైబ్రరీతో పాటు 25 కంప్యూటర్లను అందజేశారు. విద్యాభివృద్ధే లక్ష్యంగా ఆయన తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో హర్షాన్ని కలిగించింది.
డిసెంబర్ 5న పాఠశాలలో నిర్వహించిన టీచర్స్–పేరెంట్స్ మీటింగ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కల్యాణ్, విద్యార్థుల విజ్ఞప్తి మేరకు లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని ఇచ్చిన తొమ్మిది రోజుల్లోనే అమలు చేసి, మాటకు కట్టుబడి ఉండే నాయకుడిగా మరోసారి నిరూపించారు.
మెగా పేరెంట్స్–టీచర్స్ మీట్ 2.0 సందర్భంగా పాఠశాలలోని లైబ్రరీ, ల్యాబ్, తరగతి గదులను స్వయంగా పరిశీలించిన పవన్ కల్యాణ్, పుస్తకాలు తక్కువగా ఉన్న విషయాన్ని గమనించారు. వెంటనే అన్ని వయసుల విద్యార్థులకు ఉపయోగపడేలా లైబ్రరీని బహుభాషా పుస్తకాలతో నింపించాలని నిర్ణయించారు.
పెద బాలశిక్ష నుంచి కాశీమజిలీ కథల వరకు, విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలు, స్పోకెన్ ఇంగ్లీష్, హిందీతో పాటు తమిళం, కన్నడ, ఒడియా వంటి భాషల పుస్తకాలను అందుబాటులో ఉంచారు. అలాగే 25 కంప్యూటర్లతో అధునాతన స్కిల్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసి విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి బాటలు వేశారు. ఇందుకోసం సుమారు రూ.25 లక్షలు వ్యయమయ్యాయి.
డిసెంబర్ 15న చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఇతర అధికారులు లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. మాట ఇచ్చిన పది రోజుల్లోనే సొంత నిధులతో అమలు చేసి చూపిన పవన్ కల్యాణ్ సేవలు ఆదర్శనీయమని ప్రశంసించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన చూపుతున్న చొరవ అభినందనీయమని అభిప్రాయపడ్డారు.