టాటా మోటార్స్ నవంబర్ 2025లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సియెర్రా SUVను భారత మార్కెట్లో విడుదల చేసింది. లాంచ్ సమయంలో ప్రారంభ ధరను రూ.11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ప్రకటించిన కంపెనీ, తాజాగా అన్ని వేరియంట్‌ల ధరలను పూర్తిగా వెల్లడించింది. దీనితో పాటు బుకింగ్‌లను కూడా అధికారికంగా ప్రారంభించింది. ఆసక్తి ఉన్న కస్టమర్లు రూ.21,000 టోకెన్ అమౌంట్‌తో టాటా సియెర్రాను బుక్ చేసుకోవచ్చు. కంపెనీ ప్రకటన ప్రకారం, త్వరలోనే ఈ ప్రీమియం SUV డెలివరీలు ప్రారంభం కానున్నాయి. సియెర్రా ద్వారా మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో టాటా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటాలని భావిస్తోంది.
ఇంటీరియర్ విషయానికి వస్తే, టాటా సియెర్రా పూర్తిగా ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. డ్యాష్‌బోర్డ్‌పై మూడు స్క్రీన్‌ల సెటప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులో ఒకటి డ్రైవర్ డిస్‌ప్లే కాగా, మిగతా రెండు ఇన్ఫోటైన్‌మెంట్ కోసం ఉపయోగపడతాయి. ఈ స్క్రీన్‌లు కంటెంట్ షేరింగ్‌ను మరింత సులభతరం చేస్తాయి. ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్, టచ్ కంట్రోల్స్, ప్రకాశవంతమైన టాటా లోగో క్యాబిన్‌కు ఆధునిక లుక్‌ను ఇస్తాయి. 12-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, సెగ్మెంట్-ఫస్ట్ సోనిక్‌షాఫ్ట్ సౌండ్‌బార్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, దేశంలోనే అతిపెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, వెనుక సన్‌షేడ్‌లు, వెంటిలేటెడ్ మరియు పవర్డ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు దీన్ని నిజమైన లగ్జరీ SUVగా నిలబెడుతున్నాయి. సాఫ్ట్-టచ్ మెటీరియల్స్, ఫ్లోటింగ్ ఆర్మ్‌రెస్ట్‌లు క్యాబిన్‌కు మరింత క్లాస్‌ను జోడిస్తున్నాయి.
డిజైన్ పరంగా టాటా సియెర్రా పాత మోడల్ నుంచి ప్రేరణ పొందిన బాక్సీ స్టైలింగ్‌ను కొనసాగిస్తోంది. అయితే ఆధునిక డిజైన్ అంశాలతో దీనికి కొత్త ఊపునిచ్చింది. SUV మొత్తం నిటారుగా, బలమైన రోడ్ ప్రెజెన్స్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో LED హెడ్‌లైట్లు, DRLలు, గ్లోస్-బ్లాక్ యాక్సెంట్‌లు, సియెర్రా బ్యాడ్జింగ్ ప్రత్యేకంగా కనిపిస్తాయి. ముందు బంపర్‌లో స్కిడ్ ప్లేట్, డ్యూయల్ ఫాగ్ లైట్లు SUVకి రగ్డ్ లుక్‌ను అందిస్తున్నాయి. ఈ డిజైన్ సిటీ డ్రైవింగ్‌తో పాటు ఆఫ్-రోడ్ వినియోగానికి కూడా అనుకూలంగా రూపొందించారు.
భద్రత విషయంలో టాటా సియెర్రా ఎలాంటి రాజీ పడలేదు. ఈ SUVలో లెవల్-2 ADAS ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, డ్యూయల్ బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, 21-ఫంక్షన్ ESP ఉన్నాయి. అదనంగా ఆరు ఎయిర్‌బ్యాగులు, సీట్‌బెల్ట్ ప్రిటెన్షనర్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, అన్ని సీట్లకు 3-పాయింట్ ELR సీట్‌బెల్టులు వంటి కీలక భద్రతా అంశాలు ఉన్నాయి. ఇంజిన్ పరంగా, కొత్త 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 160hp పవర్, 255Nm టార్క్‌ను అందిస్తుంది. దీనితో పాటు న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, అలాగే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లు కూడా లభిస్తున్నాయి. మాన్యువల్, ఆటోమేటిక్, డ్యూయల్-క్లచ్ గేర్‌బాక్స్ ఎంపికలతో సియెర్రా అన్ని రకాల డ్రైవింగ్ అవసరాలను తీర్చేలా రూపొందించారు.