ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి PFపై వడ్డీ రేటును పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం 8.25 శాతంగా ఉన్న వడ్డీ రేటును 8.75 శాతానికి పెంచే ప్రతిపాదనపై ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగులకు లాభం చేకూరనుంది.
ప్రభుత్వం తీసుకోబోయే ఈ నిర్ణయంతో దాదాపు 8 కోట్ల మంది PF ఖాతాదారులు ప్రయోజనం పొందుతారని అంచనా వేస్తున్నారు. వడ్డీ రేటులో సుమారు 50 బేసిస్ పాయింట్ల పెరుగుదల ఉండే అవకాశం ఉంది. ఇది ఉద్యోగుల దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు మరింత బలాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో వడ్డీని ప్రభుత్వం వార్షిక ప్రాతిపదికన జమ చేస్తుంది. వడ్డీ రేటు 8.75 శాతంగా ఉంటే PF బ్యాలెన్స్‌పై స్పష్టమైన పెరుగుదల కనిపిస్తుంది. ఉదాహరణకు, మీ PF ఖాతాలో రూ.5 లక్షలు ఉంటే, పెరిగిన వడ్డీ రేటుతో మీరు సుమారు రూ.40,000 నుంచి రూ.42,000 వరకు అదనపు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.
ఈ ప్రతిపాదనను EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) వచ్చే సమావేశంలో చర్చించనున్నారు. ఆ సమావేశం అనంతరం వడ్డీ రేటుకు తుది ఆమోదం లభించే అవకాశముంది. అధికారిక అనుమతి వచ్చిన తర్వాత ఈ పెరిగిన వడ్డీని PF ఖాతాల్లో జమ చేయనున్నారు.
జనవరి నెలలో ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. వడ్డీ పెంపు వల్ల ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలపై ఆర్థిక నిపుణులు సానుకూలంగా స్పందిస్తున్నారు. దీర్ఘకాలంలో ఇది ఉద్యోగుల సేవింగ్స్‌ను పెంచి, భవిష్యత్తు ఆర్థిక భద్రతను మరింత బలపరుస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.