సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికుల రద్దీ రోజురోజుకీ మరింత ఉద్ధృతంగా మారుతోంది. వేలాది మంది తమ స్వస్థలాలకు వెళ్లేందుకు బయల్దేరడంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి పూర్తిగా కిటకిటలాడుతోంది. ఎక్కడ చూసినా వాహనాల బారులు, ట్రాఫిక్ జామ్‌లు దర్శనమిస్తున్నాయి. ఇదే పరిస్థితి బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలోనూ కనిపిస్తోంది. ప్రయాణికులతో నిండిపోయిన ప్లాట్‌ఫాంలు, కాలు పెట్టడానికి కూడా చోటు లేని పరిస్థితి నెలకొంది. “ఎలాగైనా సంక్రాంతికి ఊరు చేరాల్సిందే” అనే పట్టుదలతో ప్రజలు చిన్నపాటి యుద్ధమే చేస్తున్నట్టు కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఊరట కలిగించే శుభవార్తను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్న భారతీయ రైల్వే, తాజాగా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రాంతాల నుంచి సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం మొత్తం 11 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ రైళ్లు ఎంతో ఉపశమనంగా మారనున్నాయి.
సంక్రాంతికి ముందుగా నడిచే ప్రత్యేక రైళ్లలో హైదరాబాద్ దక్కన్ నాంపల్లి–కొల్లం జంక్షన్, అకోలా జంక్షన్–తిరుపతి సూపర్ ఫాస్ట్, పండరపూర్–తిరుపతి, చర్లపల్లి–తిరుచానూరు, ఆల్ఫా–తిరుచానూరు, చర్లపల్లి–కొల్లం జంక్షన్, నాందేడ్–తిరుచ్చిరాపల్లి, కాచిగూడ–తిరుచానూరు, హైదరాబాద్ దక్కన్ నాంపల్లి–కన్యాకుమారి, చర్లపల్లి–తిరుపతి వంటి రైళ్లు ఉన్నాయి. ఈ రైళ్లు వివిధ తేదీలు, సమయాల్లో బయల్దేరి ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చనున్నాయి. తిరుపతి, తిరుచానూరు వంటి భక్తిప్రదేశాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆ రూట్లపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఇక సంక్రాంతి పండుగ అనంతరం తిరుగు ప్రయాణాల కోసం కూడా రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తిరుపతి–పండరపూర్, కొల్లం జంక్షన్–నాందేడ్, తిరుచానూరు–చర్లపల్లి వంటి ప్రత్యేక రైళ్లను జనవరి 18, 19 తేదీల్లో నడపనున్నారు. దీని వల్ల పండుగ అనంతరం పట్టణాలకు తిరిగివచ్చే ప్రయాణికులకు ఇబ్బందులు తక్కువగా ఉంటాయని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని, రద్దీ దృష్ట్యా స్టేషన్‌కు ముందుగానే చేరుకోవాలని సూచించారు. సంక్రాంతి ప్రయాణాలను సాఫీగా సాగించేందుకు రైల్వే యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధమైంది.