స్థల పరిశీలనకు సంబంధించి నివేదికను జాతీయ పార్టీకి పంపాం..
ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో రెండోదైన గూగుల్ కి శంకుస్థాపన జరిగింది..
అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక వార్షిక సభ ‘మహానాడు’ ఈసారి నెల్లూరులో నిర్వహించేందుకు సన్నాహాలు వేగంగా సాగుతున్నాయని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. మహానాడు నిర్వహణకు సంబంధించి పలుచోట్ల స్థలాలను పరిశీలించామని, వాటిపై సమగ్ర నివేదికను పార్టీ జాతీయ నాయకత్వానికి పంపామని వెల్లడించారు. మరో ఒకట్రెండు రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.
మహానాడు అనేది 44 ఏళ్ల క్రితం నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించినప్పటి నుంచి నిరంతరం జరుగుతున్న కీలక సమావేశమని ఆయన గుర్తుచేశారు. ఈసారి మహానాడును నెల్లూరులో నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ నిర్ణయించారని తెలిపారు.
మొదట ఈ మహానాడును శ్రీకాకుళంలో నిర్వహించాలనుకున్నప్పటికీ, ఉత్తరాంధ్రలో జరుగుతున్న కీలక అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా ఆ నిర్ణయాన్ని మార్చినట్లు మంత్రి వివరించారు. ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రులు హాజరుకానుండటం, అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటైన గూగుల్ కు శంకుస్థాపన జరగడం వంటి పరిణామాల కారణంగా షెడ్యూల్ మార్పు అవసరమైందని చెప్పారు.
ఇదే కారణంగా మహానాడును నెల్లూరుకు మార్చామని, అక్కడ తొలిసారి ఈ కార్యక్రమం జరగబోతుందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీగా ప్రారంభమైన టీడీపీ, నేడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీగా ఎదిగిందని ఆయన గర్వంగా పేర్కొన్నారు. నెల్లూరులో జరిగే మహానాడు ద్వారా పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపడంతో పాటు రాష్ట్ర అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని నేతలు భావిస్తున్నారు.