అపార అవకాశాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి..
వైసీపీ ప్రభుత్వం 20 లక్షలమంది భవన నిర్మాణ కార్మికుల జీవితాలు మార్చేసింది..
రాష్ట్రంలో కార్మికుల భద్రత, సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక కార్మికుడిలా నిరంతరం శ్రమిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు.
కార్మికులకు ప్రస్తుతం ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని మంత్రి సూచించారు. అదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, సుమారు 20 లక్షల భవన నిర్మాణ కార్మికుల జీవితాలు దెబ్బతిన్నాయని, వారి భద్రతను పట్టించుకోలేదని ఆరోపించారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 30 కొత్త ఈఎస్ఐ డిస్పెన్సరీలు, ఆస్పత్రుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ ముందస్తు చర్యల వల్ల ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. భవన నిర్మాణ కార్మికుల నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు ‘మన మిత్ర’ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చామని, దీని ద్వారా కార్మికులు సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఇక సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ రోజుకు 18 గంటల పాటు శ్రామికుల్లా కష్టపడుతూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్పారు. కార్మికుల సంక్షేమాన్ని కేంద్రంగా తీసుకుని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వారి జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకువస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.