దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా కొనసాగుతోందని మరోసారి జీఎస్టీ వసూళ్ల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2025 డిసెంబరు నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రూపంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.1,74,550 కోట్ల ఆదాయం లభించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గతేడాది డిసెంబరు నెలలో నమోదైన రూ.1,64,556 కోట్లతో పోలిస్తే ఇది 6.1 శాతం వృద్ధిగా నమోదైంది. పండుగల సీజన్ ముగిసిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలు చురుగ్గా కొనసాగుతున్నాయనడానికి ఈ గణాంకాలు బలమైన ఆధారంగా నిలుస్తున్నాయి. వినియోగదారుల డిమాండ్, సేవల రంగం విస్తరణ, పారిశ్రామిక ఉత్పత్తుల పెరుగుదల వంటి అంశాలు జీఎస్టీ వసూళ్లను ఊపందుకునేలా చేశాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
డిసెంబరు నెల జీఎస్టీ వసూళ్లలో ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST) ప్రధాన వాటాను సాధించింది. ఐజీఎస్టీ రూపంలో రూ.98,894 కోట్లు వసూలు కాగా, సెంట్రల్ జీఎస్టీ (CGST) ద్వారా రూ.34,289 కోట్లు, స్టేట్ జీఎస్టీ (SGST) ద్వారా రూ.41,368 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరాయి. అదనంగా, రుణ బకాయిల చెల్లింపుల కోసం కొనసాగిస్తున్న జీఎస్టీ పరిహార సెస్ ద్వారా రూ.4,551 కోట్లు లభించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఈ సెస్ రూపంలో మొత్తం రూ.88,385 కోట్లు వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. ఇది రాష్ట్రాలకు ఇచ్చే పరిహారాల భారం తగ్గించడంలో కీలకంగా మారిందని అధికారులు పేర్కొన్నారు.
అయితే డిసెంబరు నెలలో జీఎస్టీ రిఫండ్ల రూపంలో ప్రభుత్వం రూ.28,980 కోట్లను పన్ను చెల్లింపుదారులకు తిరిగి చెల్లించింది. కొన్ని విలాసవంతమైన వస్తువులపై 40 శాతం వరకు కొత్త పన్ను శ్లాబులను ప్రవేశపెట్టినప్పటికీ, వినియోగం తగ్గకుండా కొనసాగడం గమనార్హం. మరోవైపు, పొగాకు, పాన్ మసాలా వంటి ఉత్పత్తులపై సెస్ కొనసాగుతోంది. సెప్టెంబర్ 22 నుంచి కొన్ని వస్తువులపై పన్ను రేట్లు తగ్గించినప్పటికీ, మార్కెట్లో కొనుగోళ్ల ఊపు తగ్గకపోవడంతో వసూళ్లపై ప్రతికూల ప్రభావం పడలేదని కేంద్రం తెలిపింది. దీని వల్ల వినియోగ ఆధారిత ఆర్థిక వృద్ధి బలపడుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.
ఇదే సమయంలో పొగాకు ఉత్పత్తులపై కొత్త పన్ను విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం పలు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు 2026 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) చట్టం–2025 కూడా అదే తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ చట్టం ద్వారా పొగాకు ఉత్పత్తులపై కొత్త ఎక్సైజ్ సుంక రేట్లను కేంద్రం నిర్ణయించింది. అలాగే పాన్ మసాలా తయారీపై సెస్ విధించే హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, 2025 కూడా ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రజారోగ్య పరిరక్షణతో పాటు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.