రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆర్ఆర్బీ మరోసారి సంతోషకరమైన వార్తను అందించింది. అక్టోబర్‌లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) మొత్తం 2,569 జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే తాజాగా ఆర్ఆర్బీ విడుదల చేసిన కొత్త ప్రకటనలో పోస్టుల సంఖ్యను పెంచడంతో పాటు దరఖాస్తు గడువును కూడా పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆర్ఆర్బీ తాజా ప్రకటన ప్రకారం ప్రధానంగా చెన్నై మరియు జమ్మూ–శ్రీనగర్ రీజియన్లలో ఖాళీల సంఖ్యను పెంచింది. చెన్నై రీజియన్‌లో ముందు 160 ఖాళీలు ఉండగా వాటిని 169కు పెంచగా, జమ్మూ–శ్రీనగర్ రీజియన్‌లో 88 పోస్టులు ఉండగా వాటిని 95కు పెంచింది. దీంతో మొత్తం జేఈ మరియు ఇతర పోస్టుల సంఖ్య 2,569 నుంచి 2,588కు చేరింది. ఈ మార్పులతో మరింత మంది అభ్యర్థులకు అవకాశం లభించనుంది. ప్రస్తుతం దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులకు పోస్టు ఎంపిక, రిజియన్ ప్రిఫరెన్స్ వంటి అంశాల్లో సవరణలు చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించింది.
దరఖాస్తు గడువు విషయంలో కూడా ఆర్ఆర్బీ సానుకూల నిర్ణయం తీసుకుంది. ముందుగా నవంబర్ 30తో ముగియాల్సిన చివరి తేదీని డిసెంబర్ 10, 2025 వరకు పొడిగించింది. అంతేకాకుండా డిసెంబర్ 13 నుంచి 22 వరకు దరఖాస్తులో ఎటువంటి రుసుము లేకుండా సవరణలు చేసుకునే సదుపాయం కల్పించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు తమ RRB ఎంపిక, పోస్టు ప్రాధాన్యత, రైల్వే జోన్/ప్రొడక్షన్ యూనిట్ ఎంపికల్లో మార్పులు చేయొచ్చు. అభ్యర్థులకు ఈ నిర్ణయాలు మరింత అనుకూలతను కల్పిస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.
ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియకు సంబంధించిన రాత పరీక్ష తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. దేశవ్యాప్తంగా వేలాది మంది ఇంజినీరింగ్ అభ్యర్థులు ఎదురుచూస్తున్న ఈ నోటిఫికేషన్‌కు భారీ స్పందన లభిస్తోంది. పోస్టుల సంఖ్య పెరగడం, గడువు పొడగించడం, సవరణలకు అవకాశం ఇచ్చిన సందర్భంలో అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. రైల్వేలో స్థిరమైన ఉద్యోగాలు కోరుకునే వారికి ఇది ఒక అరుదైన అవకాశం అని రిక్రూట్మెంట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.