తెలంగాణలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికంగా, పారదర్శకంగా మార్చే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందిస్తున్న ‘మహాలక్ష్మి’ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ‘కామన్ మొబిలిటీ కార్డు’ (CMC)లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆధార్ కార్డు ఆధారంగా జరుగుతున్న ఉచిత ప్రయాణంలో ఎదురవుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతో ఈ స్మార్ట్ కార్డు విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ కార్డుల రూపకల్పన, సాంకేతిక అమలు కోసం ఇప్పటికే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG)తో ఒప్పందం కుదుర్చుకుంది.
గత ఏడాది ప్రారంభమైన మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు మహిళలు సుమారు 255 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు చేశారు. ఈ పథకం అమలుకు ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీకి సుమారు రూ.8,500 కోట్లను చెల్లించింది. అయితే ప్రయాణ సమయంలో ఆధార్ కార్డు చూపించడంలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆధార్ కార్డులో ఫోటో స్పష్టంగా లేకపోవడం, వివరాలు సరిపోకపోవడం, నకిలీ ఆధార్ కార్డుల వినియోగం వంటి అంశాలు కండక్టర్లు – ప్రయాణికుల మధ్య తరచూ వాగ్వాదాలకు దారితీస్తున్నాయి. ఈ పరిస్థితులను గమనించిన ప్రభుత్వం, ఆధార్ ఆధారిత వ్యవస్థకు బదులుగా ప్రత్యేక స్మార్ట్ కార్డును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
ప్రతిపాదిత కామన్ మొబిలిటీ కార్డు కేవలం బస్సు ప్రయాణానికే పరిమితం కాకుండా బహుళ ప్రయోజనాలతో ఉండనుంది. మహిళా ప్రయాణికులు ఈ కార్డును బస్సుల్లో ట్యాప్ చేయడం ద్వారా ఉచితంగా ప్రయాణించవచ్చు. అదనంగా, కార్డులో డబ్బులు లోడ్ చేసుకుని మెట్రో రైలు, ఎంఎంటీఎస్ వంటి ఇతర ప్రజా రవాణా సేవలను కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రతిసారీ ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా, ప్రయాణ ప్రక్రియ మరింత సులభంగా, వేగంగా మారనుంది. భవిష్యత్తులో ఈ కార్డును డిజిటల్ వాలెట్‌గా కూడా అభివృద్ధి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ కామన్ మొబిలిటీ కార్డుల అమలుతో ప్రభుత్వానికి ప్రయాణికుల డేటా కచ్చితంగా అందుబాటులోకి వస్తుంది. ఏ మార్గాల్లో మహిళల రద్దీ ఎక్కువగా ఉందో, ఏ సమయాల్లో ప్రయాణాలు అధికంగా జరుగుతున్నాయో విశ్లేషించి, దానికి అనుగుణంగా బస్సు సర్వీసులను పెంచడం లేదా సర్దుబాటు చేయడం సులభమవుతుంది. దీని వల్ల ఆర్టీసీ నష్టాలు తగ్గడమే కాకుండా, రవాణా వ్యవస్థలో పారదర్శకత, సమర్థత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. భవిష్యత్తులో రేషన్, ఆరోగ్య సేవలు, ఇతర సంక్షేమ పథకాలను కూడా ఇదే కార్డుకు అనుసంధానించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. తొలి దశలో మహిళలకు మాత్రమే అమలు చేసి, ఆ తర్వాత దశలవారీగా రాష్ట్ర ప్రజలందరికీ ఈ కార్డులను అందుబాటులోకి తీసుకురానున్నారు.