Minister Durgesh: ఏపీ సాంస్కృతిక రంగానికి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్.. నెల రోజుల్లో కీలక ఉత్తర్వులు.. మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు!
Minister Durgesh: ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, పర్యాటక రంగాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ముందడుగు పడింది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఢిల్లీలో చేపట్టిన రెండో రోజు పర్యటన ఫలవంతంగా సాగింది. కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్‌తో జరిగిన కీలక సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన ఐదు ప్రధాన సాంస్కృతిక ప్రతిపాదనలపై కేంద్రం సానుకూలంగా స్పందించింది.
మంత్రి కందుల దుర్గేష్ ఢిల్లీ పర్యటన ఫలితం.. ఏపీకి కేంద్రం సానుకూల స్పందన..
రాజమహేంద్రవరం, విజయవాడ, కడపలకు శుభవార్త.. సాంస్కృతిక కేంద్రాలుగా రూపాంతరం..
న్యూఢిల్లీ/అమరావతి: ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, పర్యాటక రంగాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ముందడుగు పడింది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఢిల్లీలో చేపట్టిన రెండో రోజు పర్యటన ఫలవంతంగా సాగింది. కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్‌తో జరిగిన కీలక సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన ఐదు ప్రధాన సాంస్కృతిక ప్రతిపాదనలపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈ ప్రతిపాదనలకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి నెల రోజుల్లో అధికారిక సర్క్యులర్ జారీ చేస్తామని కేంద్రం హామీ ఇవ్వడం రాష్ట్ర సాంస్కృతిక రంగానికి శుభపరిణామంగా భావిస్తున్నారు.
మంత్రి కందుల దుర్గేష్ కేంద్రానికి సమర్పించిన ప్రతిపాదనల్లో రాష్ట్ర సాంస్కృతిక అభివృద్ధికి దోహదపడే పలు కీలక అంశాలు ఉన్నాయి. వాటిలో రాజమహేంద్రవరంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్‌లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) కేంద్రం స్థాపన, లలిత కళా అకాడమీ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు, విజయవాడలోని జి.వి.ఆర్. ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ప్రాంగణంలో అత్యాధునిక కళాక్షేత్ర ఆడిటోరియం నిర్మాణం, అలాగే కడపలో కేంద్ర సాహిత్య అకాడమీ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు వంటి ప్రతిపాదనలు ఉన్నాయి.
ఈ అంశాలపై కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ సానుకూలంగా స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిరంతర ఫాలోఅప్‌ను అభినందించారు. ప్రతిపాదనలను త్వరితగతిన పూర్తి చేసి నెల రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి దుర్గేష్‌కు హామీ ఇచ్చారు.
సమావేశం అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు, కళలకు పునర్వైభవం తీసుకురావడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తక్షణ స్పందన చూపి నెల రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇవ్వడం రాష్ట్రంలోని కళాకారులు, సాంస్కృతిక సంస్థలకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుందని పేర్కొన్నారు.
ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఫెయిత్ టూరిజం కాన్‌క్లేవ్-2026 రెండో రోజు కార్యక్రమాల్లో కూడా మంత్రి కందుల దుర్గేష్ చురుకుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఏపీ టూరిజం స్టాల్‌ను సందర్శించి, రాష్ట్రంలోని చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటక విశిష్టతలను జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు స్వయంగా వివరించారు.
అలాగే పలువురు దేశీయ, విదేశీ ఇన్వెస్టర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగంలో ఉన్న విస్తృత పెట్టుబడి అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని, పెట్టుబడిదారులకు పూర్తి భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు.
మంత్రి కందుల దుర్గేష్‌తో పాటు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ కూడా సమావేశాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, పెట్టుబడిదారులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, భవిష్యత్ ప్రాజెక్టులపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే రాజమహేంద్రవరం, విజయవాడ, కడప నగరాలు రాష్ట్ర సాంస్కృతిక కేంద్రాలుగా మరింత గుర్తింపు పొందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన సానుకూల సంకేతాలతో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రంగానికి కొత్త ఊపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెరగడం ద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
Tags
Be the first to react