ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న 18189 నంబర్ టాటా–ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అగ్నిప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున సుమారు 1:30 గంటల సమయంలో యలమంచలి సమీపంలో ఈ ఘటన జరిగింది.
ప్యాంట్రీ కారుకు సమీపంలో ఉన్న బీ1, ఎం2 ఏసీ బోగీల్లో తొలుత దట్టమైన పొగలు వెలువడ్డాయి. ఆ వెంటనే భగ్గుమంటూ మంటలు చెలరేగి క్షణాల్లోనే రెండు బోగీలకు వ్యాపించాయి. మంటలు చాలా వేగంగా విస్తరించడంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
మంటలను గమనించిన లోకో పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. రైలును యలమంచలి స్టేషన్‌లో నిలిపివేసి, రైల్వే అధికారులకు మరియు అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు. అయితే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునేలోపే రెండు ఏసీ బోగీలు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి.
సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైర్ టెండర్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. బోగీల్లో పొగలు నిండిపోవడంతో ప్రయాణీకులు ప్లాట్‌ఫారమ్‌లపైకి పరుగులు తీశారు. కొంతసేపు తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రాథమికంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
ఈ ప్రమాదానికి కారణాలపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సడన్ బ్రేకులు వేయడం వల్లే అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గురైన బోగీలను రైలు నుంచి వేరు చేసి సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని దక్షిణమధ్య రైల్వే తెలిపింది.