తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల పాటు చలి మరింత పెరగనుందని హెచ్చరించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోతుండటంతో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం ద్వారా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంగళవారం రాత్రి ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ)లో 10.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవ్వడం చలితీవ్రతకు నిదర్శనమైంది.
ఈ చలి వాతావరణం ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పడిపోవడం వల్ల హైపోథెర్మియా, ఫ్రాస్ట్‌బైట్ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు. చల్లని వాతావరణం కారణంగా రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల వైరల్ ఇన్‌ఫెక్షన్లు సులభంగా వ్యాపిస్తాయని, దీంతో జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, న్యూమోనియా, శ్వాసకోశ సమస్యలు అధికమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఆసుపత్రులకు ఇలాంటి లక్షణాలతో వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఆస్తమా, సీవోపీడీ వంటి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నవారిలో లక్షణాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు.
చలితీవ్రత కారణంగా కొన్ని వర్గాల ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, దివ్యాంగులు, అలాగే ఆరుబయట పనిచేసే కార్మికులు ఎక్కువగా చలికి గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. అందువల్ల వీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శరీరాన్ని వెచ్చగా ఉంచే బట్టలు ధరించడం, చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్స్‌లు వేసుకోవడం, గోరువెచ్చని నీరు తాగడం, చల్లని గాలికి ఎక్కువసేపు గురికాకుండా చూడడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఆస్తమా రోగులు తమ ఇన్‌హేలర్లను ఎప్పటికప్పుడు దగ్గరలో ఉంచుకోవాలని, బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం “తీవ్ర చలి ప్రభావిత” (కోర్ కోల్డ్ వేవ్) జోన్‌లో ఉన్న రాష్ట్రాల్లో ఒకటని కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని ఎన్‌పీసీసీహెచ్‌హెచ్ (National Programme on Climate Change and Human Health) ఇప్పటికే గుర్తించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా రాష్ట్రవ్యాప్తంగా అదే తరహా వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో ఆరోగ్య శాఖ ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ మార్పులు, వాయు ప్రవాహాల దిశలో మార్పులు, పొగమంచు పరిస్థితులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తగ్గించే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. ఇంట్లో వృద్ధులు, పిల్లలు ఎక్కువసేపు చల్లని గాలికి గురికాకుండా చూసుకోవాలని సూచించారు.