చిరంజీవి–దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా గురించి రోజుకో కొత్త వార్త బయటకు వస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని రస్టిక్ మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందించనున్నట్లు ప్రచారం జరుగుతుండగా, తాజాగా వినిపిస్తున్న క్యాస్టింగ్, టెక్నికల్ టీమ్ రూమర్లు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా తర్వాత చిరంజీవి పూర్తి ఫోకస్ ఈ ప్రాజెక్ట్‌పైనే పెట్టారని సినీ వర్గాల సమాచారం. ఇది చిరంజీవి కెరీర్‌లో 158వ సినిమా కావడంతో మొదటి నుంచే దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. దర్శకుడు బాబీ కూడా ఈ సినిమాను గత చిత్రాలకంటే భిన్నంగా, పూర్తిగా కొత్త షేడ్‌లో తెరకెక్కించేందుకు కథలో కీలక మార్పులు చేస్తున్నారని టాక్. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు బలమైన భావోద్వేగాలు ఉండేలా స్క్రిప్ట్‌ను డిజైన్ చేస్తున్నారని అంటున్నారు.
ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. నిర్మాతలు వెంకట్ కె. నారాయణ, లోహిత్ ఎలాంటి రాజీ పడకుండా సినిమా క్వాలిటీపై పూర్తి దృష్టి పెట్టారని సమాచారం. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ చిరంజీవిని పవర్‌ఫుల్ మాస్ లుక్‌లో చూపిస్తూ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. పోస్టర్ విడుదలైన క్షణాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో వైరల్ కావడం సినిమాపై ఉన్న హైప్‌కు నిదర్శనంగా నిలిచింది.
టెక్నికల్ విభాగంలోనూ ఈ సినిమా ప్రత్యేకంగా ఉండనుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం. ఆయన గతంలో చేసిన చిత్రాలు విజువల్‌గా మంచి పేరు తెచ్చుకోవడంతో ‘మెగా 158’కు కూడా అదే స్థాయిలో అవుట్‌పుట్ వస్తుందన్న నమ్మకం వ్యక్తమవుతోంది.
ఇక ఈ సినిమా గురించి అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం క్యాస్టింగ్. చిరంజీవి సరసన హీరోయిన్ ఎవరు అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే చిరంజీవి కూతురు పాత్రలో ఓ యంగ్ హీరోయిన్‌ను తీసుకునే ఆలోచనలో టీమ్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో బాలీవుడ్ మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్త అభిమానుల్లో సంచలనం సృష్టించింది. ఆమె పూర్తి స్థాయి పాత్ర చేస్తారా? లేక ప్రత్యేక అతిథి పాత్రలో కనిపిస్తారా? అన్నది ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. కానీ చిరంజీవి–ఐశ్వర్య రాయ్ ఒకే సినిమాలో కనిపిస్తే అది ప్రేక్షకులకు పెద్ద విజువల్ ట్రీట్ గా చెప్పుకోవాల్సింది.
మ్యూజిక్ డైరెక్టర్ విషయంలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారన్న రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ వార్త మరింత బలంగా వినిపించడంతో అభిమానుల్లో ఆశలు పెరిగాయి. ఇప్పటికే ఆయన పలు భారీ ప్రాజెక్ట్‌లకు పని చేస్తున్న నేపథ్యంలో చిరంజీవి సినిమాకు కూడా ఆయనే సంగీతం ఇస్తే సినిమాకు అదనపు బలం చేకూరుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, ఈ సినిమాలో మరో స్టార్ హీరో కీలక పాత్రలో నటించనున్నాడన్న ప్రచారం కూడా కొనసాగుతోంది. మొదట కార్తీ పేరు వినిపించినా, తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. మోహన్ లాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న వార్తలు నిజమైతే, చిరంజీవి–మోహన్ లాల్ కాంబినేషన్ తెరపై చూడటం అభిమానులకు పండుగే అవుతుందన్న మాట వినిపిస్తుంది.