చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం చర్యల గ్రామానికి చెందిన కె.రమణ నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. దుర్గసముద్రం రెవిన్యూ పరిధిలో సర్వే నెంబర్లు 329, 611, 612, 613, 618లలో సుమారు 3 హెక్టార్ల నల్లరాయి (గ్రానైట్) క్వారీ భూమికి సంబంధించి అన్ని నిబంధనలను అనుసరించి దరఖాస్తులు చేసుకున్నాం.
ఈ భూములకు సంబంధించి 2013, 2015 సంవత్సరాల్లో తహశీల్దార్ కార్యాలయాల నుండి NOCలు కూడా జారీ అయ్యాయి. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ ఒత్తిళ్లతో తనకు లీజులు రాకుండా అడ్డుకున్నారు. ఈ కారణంగా నాలుగు సంవత్సరాలు జైలులో ఉండాల్సి వచ్చిందని, అంతేకాకుండా తన కుమారులపై కూడా తప్పుడు కేసులు పెట్టి కుటుంబాన్ని వేధించారు.
కావునా తమయందు దయవుంచి వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని నేతలు హోం మంత్రి వంగలపూడి అనిత, శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధలకు అర్జీ ఇచ్చి అభ్యర్ధించాడు.
నంద్యాల జిల్లా గడివేముల మండలం కొర్రపోవారు గ్రామానికి చెందిన మాలిక్ బాష గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో వైసీపీ నాయకులు, వారి అనుచరులు భారీగా భూములను అక్రమంగా కబ్జా చేశారు.
జడ్పీటీసీ చంద్రశేఖర్ రెడ్డి 25 ఎకరాలు, షబ్బీర్ 42 ఎకరాలు, మాజీ సర్పంచ్ సుబ్బారెడ్డి 35 ఎకరాలు, దివాన్ సా కుమారులు 45 ఎకరాలు, మూలింద బ్రదర్స్ 45 ఎకరాలు, జంగల రమణయ్య 15 ఎకరాలు, వడ్డే రాజు 18 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కావున అక్రమ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుని ఆ భూములను స్వాధీనం చేసుకుని భూమిలేని పేదలకు కేటాయించాలని కోరారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరంకు చెందిన వెంకటేశ్వరరావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. గుంత రోడ్డుపై ఉన్న ఆర్ అండ్ బీ సైట్ పరిధిలో ఉన్న కొబ్బరి చెట్లను కొందరు దుండగులు ఉద్దేశపూర్వకంగా నరికివేశారు.
ఈ ఘటన ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించలేదు. వైసీపీకి చెందిన వ్యక్తులు చెట్లు నరికివేశారు. దానికి సంబంధించిన ఫోటోలు, ఆధారాలను ఉన్నాయి. అప్పట్లో విధుల్లో ఉన్న ఆర్ అండ్ బీ జేఈ నిర్లక్ష్యం వహించారు. కావున వారిపై చెట్లు నరికిన వారిపై, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరాడు.
చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన ఈశ్వరమ్మ, వెంకటరమణ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. పుంగనూరు మున్సిపాలిటీ భగత్‌సింగ్ కాలనీ, షుగర్ ఫ్యాక్టరీ రోడ్డుకు పడమటి వైపున ఉన్న సర్వే నెం. 30/5లో 10 మంది పేదలకు 21-11-2010న ఇళ్ల పట్టాలు మంజూరు చేయగా, తాము పునాదులు వేసుకొని ఉన్నాం.
అయితే సమీపంలోని సర్వే నెం. 30/4లో భూమి కొనుగోలు చేసిన రామసముద్రం మండలం రాగిమాకులపల్లి చెందిన వైసీపీ నేత భాస్కర్ పేదలు వేసుకున్న పునాదులను తొలగించి తన ఆక్రమణలో కలుపుకున్నాడు. ఈ విషయమై అప్పట్లో తహశీల్దార్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. కావునా వారిపై చర్యలు తీసుకోని ఆక్రమణలను తొలగించి పేదల ఇళ్ల స్థలాలకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరారు.
ప్రకాశంజిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలముప్పాళ్ళ గ్రామానికి చెందిన హనుమంతరావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. ఇంకొల్లు మండలం దుద్దుకూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెం.478లో ఎకరం 1.58 సెంట్ల వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. అయితే సుమారు 7 సంవత్సరాల క్రితం రాచపూడి గ్రామానికి చెందిన జాగర్లమూడి రత్తయ్య కుమారుడు వెంకటరావు భార్య శారద తన చేనులో పంటను తీసుకెళ్లి వేధింపులకు గురి చేశారు.
ప్రస్తుతం తమ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆమెకు వత్తాసు పలుకుతూ తనను చేనులోకి వెళ్లనీయకుండా అడ్డుకుంటూ, బెదిరింపులకు పాల్పడుతున్నారు. భూమి తమదని చెబుతూ దొంగ పాసుపుస్తకాలు సృష్టించి దౌర్జన్యం చేస్తున్నారు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ భూమి సమస్యను పరిష్కరించాలని కోరాడు.
కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనకేరి గ్రామానికి చెందిన మల్లయ్య గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలో తన పేరిట 1971లో రిజిస్టర్ అయిన సర్వే నెం.124లో 0.25 సెంట్ల భూమిని ఇప్పటికీ ఆన్‌లైన్‌లో నమోదు చేయడం లేదు.
గత వైసీపీ ప్రభుత్వ కాలంలో అధికారుల నిర్లక్ష్యంతో తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నాను రెవెన్యూ అధికారులు డబ్బు ఇస్తేనే పని చేస్తామని చెప్పి న్యాయం చేయడం లేదు. అన్ని చట్టబద్ధ పత్రాలు ఉన్నప్పటికీ భూమి నమోదు కావడం లేదు. కావునా తమయందు దయవుంచి నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.
నంద్యాల జిల్లా డోన్ మండలం చిన్నమల్కాపురం గ్రామానికి చెందిన ఎల్లప్ప గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. చోల మండలం ఫైనాన్స్ ద్వారా AP21 BK 7849 నంబర్ జెసీబీ (మోడల్–16)ను రూ.25 లక్షల రుణంతో కొనుగోలు చేసి నెలకు రూ.49,220 చొప్పున క్రమంగా కంతులు చెల్లించాను. లోన్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరితే, డోన్ చోలమండలం ఫైనాన్స్ మేనేజర్ మధు, కర్నూలు హెడ్ ఆఫీస్ సిబ్బంది శివ, రవి తనను బెదిరిస్తున్నారు.
తన కుమార్తె కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిన సమయంలో డోన్ బైపాస్ వద్ద నిలిపిన తన జెసీబీని మునుగుప్ప మండలానికి చెందిన జయప్రకాష్ రెడ్డి దొంగిలించి, అనంతపురం జిల్లా బుల్లపల్లి మండలం నల్లబోనుపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు సూర్యప్రకాష్ రెడ్డికి అమ్మాడు. అనంతరం ఆ వాహనాన్ని ధర్మవరం పట్టు చీరల వ్యాపారి మహేష్‌కు విక్రయించినట్లు తెలిసింది. కావున ఈ ఘటనపై తక్షణ చర్యలు తీసుకుని తమ వాహనాన్ని స్వాధీనం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఏరువారిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస రెడ్డి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో తమ కుటుంబ భూమి విషయంలో కొనసాగుతున్న సివిల్ వివాదాన్ని ఉద్దేశపూర్వకంగా క్రిమినల్ కేసులుగా మార్చి తమను పోలీసులు వేధిస్తున్నారు. తమ పొలంలో వేసిన కంది పంటను ప్రత్యర్థులు ట్రాక్టర్‌తో నాశనం చేసి ప్రశ్నించినందుకు దాడి చేశారు. డయల్ 100కు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు.
పైగా తమపై తప్పుడు కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వకుండా తరచూ పోలీస్ స్టేషన్‌కు పిలిపిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కొందరు పోలీసు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడి అవమానాలకు గురిచేశారు, సీసీటీవీ ఫుటేజీల పరిశీలనతో నిజాలు బయటపడతాయి. భూవివాదాన్ని సివిల్ పరిధిలోనే పరిష్కరించి, అధికార దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరాడు.
కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం రామదుర్గం గ్రామానికి చెందిన శ్రీనివాసులు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..తమ గ్రామంలో తన కుటుంబం సుమారు 80 సంవత్సరాలుగా సాగు చేస్తున్న 2 ఎకరాల భూమిని 2022లో వైసీపీ ప్రభుత్వ కాలంలో కొందరు రెవెన్యూ అధికారులు అక్రమంగా ఇతరుల పేరున ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.
తన వద్ద పట్టాదారు పాస్‌బుక్, ఎంజాయ్‌మెంట్ సర్టిఫికెట్లు ఉన్నప్పటికీ న్యాయం జరగలేదు. కావున వారిపై చర్యలు తీసుకోని అక్రమంగా నమోదు చేసిన డి. రామగోపాల్ పేరు తొలగించి తన పేరున భూమిని రెవెన్యూ ఆన్‌లైన్ రికార్డులో నమోదు చేయాలని కోరాడు.
అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన రవి శంకర్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ..సర్వే నెం. 961/బి4/2లో 5 సెంట్ల స్థలాన్ని 1960లో తమ తండ్రి పేరున రిజిస్టర్ చేసుకుని అదే సంవత్సరంలో కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ద్వారా ఇల్లు నిర్మించుకున్నాం.
దశాబ్దాలుగా నివాసంగా ఉండి జీవనం సాగించిన ఈ ఇల్లు ప్రస్తుతం శిధిలావస్థకు చేరడంతో పునర్నిర్మాణానికి రాజంపేట మున్సిపాలిటీ అనుమతి కోరితే స్థలాన్ని “చుక్కల భూమి”గా చూపుతూ నిరాకరించారు. గతంలో 2007లో ఇదే ఇంటికి మున్సిపాలిటీ అప్రూవల్ మంజూరైనా కుటుంబ ఆరోగ్య కారణాల వల్ల నిర్మాణం జరగలేదు. కావున తమయందు దయవుంచి చట్టబద్ధ రిజిస్ట్రేషన్, డోర్ నెంబర్లు ఉన్న తమ ఇంటికి అనుమతి ఇచ్చి సమస్యను పరిష్కరించాలని కోరాడు.
పల్నాడు జిల్లా అమరావతి మండలం ధరణికోట గ్రామానికి చెందిన రామదాసు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తన తాతకు 1972లో మంగళగిరి డిప్యూటీ తహశీల్దార్ ద్వారా 4 సెంట్ల పట్టా మంజూరు కాగా, పక్కనే ఉన్న మరో 4 సెంట్ల స్థలాన్ని 1992లో కొనుగోలు చేసి పూర్తి హక్కులతో వినియోగంలో ఉన్నాం.
అయితే పక్క స్థలానికి చెందిన మీడాసు నాగేశ్వరరావు అక్రమంగా వివాదాలు సృష్టించి కేసులు పెట్టడంతో కోర్టును ఆశ్రయించి తమకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు, పోలీసులు స్థలాన్ని తమకు అప్పగించడంలేదు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ స్థలాన్ని తమకు అప్పగించాలని కోరాడు.
చిత్తూరు జిల్లా నగరికి చెందిన శక్తివేల్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. 15-09-2025న తన ఇంటి స్థలానికి సంబంధించిన సమస్యపై గౌరవ ముఖ్యమంత్రి కార్యాలయానికి అర్జీ ఇవ్వగా ఆ తర్వాత 22-09-2025న నగరి ఆర్‌డీఓ కార్యాలయం నుంచి తమకు నోటీసు వచ్చింది.
ఆర్‌డీఓను కలిసినప్పుడు “సీఎం కార్యాలయానికి ఎందుకు వెళ్లావు” అంటూ బెదిరించి తన పేరిట ఉన్న పట్టాను రద్దు చేశారు. ఈ వివాదానికి కారణం గతంలో వీఆర్‌ఓ విజయభాస్కర్ రెడ్డి లంచం తీసుకుని చేసిన అక్రమ చర్యలే, ప్రస్తుతం వీఆర్‌ఓ జయచంద్ర డాక్యుమెంట్లు ఉన్నాయని చెబుతున్నా చూపించడం లేదు.
29-08-2025న విచారణకు పిలిచి అన్ని ఆధారాలు తీసుకెళ్లినా ఆర్‌డీఓ స్వీకరించలేదు. సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేసిన కారణంతోనే అక్రమంగా పట్టా రద్దు చేశారు. కావున సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరాడు.
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం గుండుగొలనుకుంట గ్రామానికి చెందిన వీరమళ్ళ గాంధీ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో తండ్రి సంపాదించిన సర్వే నెం .47/2ఎ లోని య.2.72 ఎకరాల భూమి, ఇంటి స్థలంలో తనకు న్యాయబద్ధమైన జాయింట్ హక్కు ఉంది. 2013లో తండ్రి మరణానంతరం అన్న వీరమళ్ల రాము మొత్తం ఆస్తి తనదేనని చెప్పి తనను వేరు చేయడంతో కుటుంబ కలహాలు చోటు చేసుకున్నాయి.
ఈ విషయమై ఏలూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఓ.ఎస్.నెం.148/2014 దావా వేయగా, కోర్టు తీర్పు తనకు అనుకూలంగా 1/4 వంతు భాగంగా య.0.54 ఎకరాల భూమి హక్కు లభించింది. అయినప్పటికీ కోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా అన్న రాము ఆ భూమిని దేవరపల్లి సుదర్శనం అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చి పంట వేయించాడు. దీనిపై తాను అభ్యంతరం వ్యక్తం చేయగా ఇద్దరూ కలిసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ భూమి సమస్యను పరిష్కరించాలని కోరాడు.
వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్ లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్ధికతోడ్పాటు కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు అందించారు.