డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో కీలక మార్పులకు దారితీసేలా టెలికాం శాఖ (DoT) కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, అరట్టై వంటి ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ప్రభావితం కానున్నందున ఈ మార్పులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ప్రతి ఆరు గంటలకు యూజర్లు తమ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ కావాల్సి రావడం, మళ్లీ యాప్‌లోకి ప్రవేశించడానికి రీ–ఆథెంటికేషన్ తప్పనిసరి కావడం వినియోగదారుల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది.
కొత్త నిబంధనల ప్రకారం యాప్‌లు తమ వినియోగదారుల వివరాలను మరింత సమగ్రంగా ధృవీకరించాల్సి ఉంటుంది. యూజర్ ఓటీపీ లేదా బయోమెట్రిక్ ద్వారా తిరిగి లాగిన్ కావాల్సి రావచ్చు. ఈ మార్పుల వెనుక ప్రధాన ఉద్దేశ్యం సైబర్ భద్రతను బలోపేతం చేయడం, ఫేక్ ఖాతాల ద్వారా జరిగే మోసాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, గుర్తింపు దొంగిలింపు వంటి సమస్యలను తగ్గించడం అని ప్రభుత్వం చెబుతోంది. ప్రత్యేకించి, ఎన్‌క్రిప్టెడ్ ప్లాట్‌ఫార్మ్‌ల దుర్వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారుల అసలు గుర్తింపును నిర్ధారించేందుకు ఈ నియమాలు ఉపయోగపడతాయని అధికారులు వివరిస్తున్నారు.
అయితే యూజర్లు తరచూ లాగ్ అవుట్ కావడం వల్ల చాటింగ్ అనుభవం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. పని సంబంధిత గ్రూపులు, అధికారిక కమ్యూనికేషన్, బిజినెస్ అకౌంట్స్‌కు కూడా ఇది అదనపు భారంగా మారే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంటున్నారు. ఒకసారి ఆరు గంటల వ్యవధి పూర్తికాగానే యాప్ మళ్లీ లాగిన్ చేయాలని అడగడం, ప్రతి సారి ఓటీపీ రావడం వంటి ప్రక్రియలు యూజర్ ఫ్లోను తగ్గించవచ్చని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
అంతేకాదు, కమ్యూనికేషన్ యాప్‌లు తమ సర్వర్ల సామర్థ్యం పెంచుకోవాల్సి వస్తుంది. రీ–ఆథెంటికేషన్ రిక్వెస్టులు పెరగనునందున అదనపు భద్రతా ఫ్రేమ్‌వర్క్ అవసరం అవుతుంది. మరోవైపు, ప్రైవసీ కార్యకర్తలు మాత్రం ఈ నిబంధనలు వినియోగదారుల వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రభావం చూపవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండ్‌టు–ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్నప్పటికీ, ఇలాంటి తరచూ జరిగే ధృవీకరణ processes ప్రైవసీ హక్కులపై ప్రశ్నలు లేవనెత్తవచ్చని వారు అంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో టెక్ పరిశ్రమ ప్రభుత్వం నిర్ణయంపై వివరాలు కోరుతోంది. ఈ మార్పులు ఎప్పుడు అమల్లోకి వస్తాయి? వాణిజ్య వినియోగదారులకు–వ్యక్తిగత వినియోగదారులకు వేర్వేరు నిబంధనలు ఉంటాయా? అన్న అంశాలపై స్పష్టత వచ్చే వరకు ప్లాట్‌ఫార్మ్‌లు యూజర్లకు గందరగోళం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం మాత్రం స్పష్టంగా చెబుతోంది సైబర్ భద్రతే ప్రాధాన్యం. డిజిటల్ కమ్యూనికేషన్ యుగంలో దేశ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా ఈ చర్యలు అవసరమని అధికారులు అంటున్నారు. రాబోయే రోజుల్లో DoT మరిన్ని వివరణలు ఇవ్వనున్నట్లు సమాచారం. యాప్ వినియోగదారులు, ప్రైవసీ నిపుణులు, టెక్ కంపెనీపై ఈ నిర్ణయం ఎలా ప్రభావం చూపుతుందో చూడాల్సిందే.