PAN–Aadhaar లింక్ డెడ్‌లైన్ దగ్గర పడుతోంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం PAN కార్డును Aadhaar నంబర్‌తో లింక్ చేయడానికి చివరి గడువుగా డిసెంబర్ 31, 2025ను నిర్ణయించారు. ఈ తేదీ లోపు లింకింగ్ పూర్తి చేయకపోతే, జనవరి 1, 2026 నుంచి PAN కార్డు ఇనోపరేటివ్‌గా మారుతుంది. అంటే ఆ PAN కార్డుతో ఎలాంటి అధికారిక ఆర్థిక లావాదేవీలు చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది.
PAN–Aadhaar లింక్ చేయకపోతే తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడం సాధ్యం కాదు. అలాగే ఇప్పటికే ఫైల్ చేసిన రిటర్న్లకు సంబంధించిన రిఫండ్లు నిలిచిపోతాయి. అంతేకాదు, బ్యాంక్ లావాదేవీలపై TDS, TCS ఎక్కువ రేట్లతో కట్ అయ్యే అవకాశం ఉంది. ఇది వ్యాపారులు, ఉద్యోగులు, పెట్టుబడిదారులపై నేరుగా ప్రభావం చూపుతుంది.
PAN–Aadhaar లింక్ చేసే విధానం చాలా సులువు. ఇందుకోసం అధికారిక Income Tax e-Filing వెబ్‌సైట్ (www.incometax.gov.in) లో లాగిన్ కావాలి. అక్కడ “Link Aadhaar” అనే ఆప్షన్‌ను ఎంచుకుని PAN, Aadhaar వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత Aadhaarకు లింక్ అయిన మొబైల్‌కు వచ్చిన OTPని వెరిఫై చేస్తే లింకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.
లింక్ అయ్యిందా లేదా అన్నది కూడా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. అదే e-Filing పోర్టల్‌లో “Link Aadhaar Status” అనే ఆప్షన్ ద్వారా PAN, Aadhaar నంబర్లు ఎంటర్ చేస్తే వెంటనే స్టేటస్ కనిపిస్తుంది. ఇప్పటికే లింక్ అయి ఉంటే స్పష్టమైన మెసేజ్ చూపిస్తుంది. లేదంటే ఇంకా లింక్ చేయాల్సి ఉందని సూచిస్తుంది.
Aadhaar ఎన్‌రోల్‌మెంట్ ఐడీ ఆధారంగా అక్టోబర్ 1, 2024కు ముందు PAN పొందినవారు తప్పనిసరిగా ఈ లింకింగ్ పూర్తి చేయాలి. లింక్ చేయని PAN అమాన్యమైతే బ్యాంకింగ్, పెట్టుబడులు, పన్ను వ్యవహారాల్లో అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి చివరి నిమిషం కోసం వేచిచూడకుండా ముందుగానే లింక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.