2026 జనవరి 1 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కొత్త ఏడాది ప్రారంభంతోనే పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
వచ్చే ఏడాది నుంచి కార్లు, టూ-వీలర్ల ధరలు పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పలు ఆటోమొబైల్ కంపెనీలు ధరల పెంపుపై ప్రకటనలు చేస్తున్నాయి. ఇదే క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు కూడా ధరలు పెంచే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా ఏథర్ ఎనర్జీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది.
ముడి సరుకుల ధరలు పెరగడం, అంతర్జాతీయంగా కీలక ఎలక్ట్రానిక్ భాగాల ధరలు అధికమవడం, ఫారెక్స్ ప్రభావం వంటి అంశాల వల్ల ధరలు పెంచాల్సి వచ్చిందని తెలిపింది. అన్ని మోడళ్లపై కలిపి గరిష్ఠంగా రూ.3 వేల వరకు ధర పెరుగుతుందని వెల్లడించింది. అయితే ఈ పెంపు ఒక్కో మోడల్‌ను బట్టి మారుతుందని స్పష్టం చేసింది.అయితే డిసెంబర్ నెలలో కొనుగోలు చేసే వారికి కొంత ఊరట లభిస్తోంది. ధరలు పెరగకముందే కస్టమర్లను ఆకర్షించేందుకు డిసెంబర్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన నగరాలు, పట్టణాల్లో ఏథర్ స్కూటర్ కొనుగోలుపై రూ.20 వేల వరకు ప్రయోజనాలు అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
ప్రస్తుతం మార్కెట్లో ఏథర్ స్కూటర్ల ధరలు ఎలా ఉన్నాయంటే, ఏథర్ 450 సిరీస్‌లోని పెర్ఫార్మెన్స్ స్కూటర్లు, ‘రిజ్తా’ పేరుతో ఫ్యామిలీ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు రూ.1,14,546 నుంచి ప్రారంభమై గరిష్ఠంగా రూ.1,82,946 వరకు ఉన్నాయి. కాబట్టి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారు జనవరి 1, 2026కు ముందే నిర్ణయం తీసుకుంటే డబ్బు ఆదా చేసే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.