ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి ‘అర్బన్ ఆటో మ్యుటేషన్ ఆఫ్ ప్రాపర్టీస్’ అనే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో రిజిస్ట్రేషన్లు (Registration) పూర్తైన రోజే ఆస్తి యజమాని వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో స్వయంచాలకంగా అప్‌డేట్ అవుతాయి. దీంతో ప్రజలకు సమయం ఆదా అవడమే కాకుండా అవినీతి తగ్గే అవకాశాలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు.
గత ఏడాది ఆగస్టు నెలలో ఈ కొత్త 'అర్బన్ ఆటో-మ్యుటేషన్ ఆఫ్ ప్రాపర్టీస్' (Auto Mutation) విధానాన్ని రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. అంతకుముందు గ్రామీణ ప్రాంతాల్లో ఇదే తరహా విధానాన్ని అమలు చేయగా మంచి ఫలితాలు రావడంతో నగర ప్రాంతాల్లోనూ దీనిని విస్తరించారు. ఆస్తి అమ్మకం, కొనుగోలు, వారసత్వం లేదా బహుమతి వంటి లావాదేవీలన్నీ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారానే పూర్తవుతాయి.
ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత గత ఐదు నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 23 వేల ఆస్తుల మ్యుటేషన్లు పూర్తయ్యాయి. దీని వల్ల అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట పడటంతో పాటు, పేరు మార్పు కోసం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం తొలగిపోయింది. అంతేకాదు, ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి రూ.8 కోట్ల ఆదాయం కూడా సమకూరింది.
పాత విధానంలో అయితే రిజిస్ట్రేషన్ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్‌కు వెళ్లి వేరుగా దరఖాస్తు చేయాల్సి వచ్చేది. ఫీజుల పేరుతో ఆలస్యం, అదనపు ఖర్చులు ఎదురయ్యేవని ప్రజలు ఆరోపించేవారు. కానీ ఇప్పుడు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ డేటాను మున్సిపల్ డేటాతో అనుసంధానం చేయడంతో రిజిస్ట్రేషన్ పూర్తైన వెంటనే మ్యుటేషన్ కూడా పూర్తవుతోంది.
అయితే ఈ కొత్త విధానంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా కొత్త ఫ్లాట్లకు అసెస్‌మెంట్ నంబర్లు కేటాయించడంలో, ఖాళీ స్థలాలపై పన్నులు విధించడంలో ఆలస్యం జరుగుతోందని చెబుతున్నారు. వీటిని పరిష్కరించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మొత్తం మీద ఈ విధానం ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.