వైసీపీ రీసర్వేపై తీవ్ర దుమారం! 250 మెట్లు ఎక్కి తాగునీరు మోయలేకపోతున్నాం!
TDP Grievance: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి ప్రజల నుంచి భారీగా వినతులు అందాయి. గత ప్రభుత్వ రీసర్వే వల్ల భూ రికార్డుల్లో జరిగిన గందరగోళం, డోన్ మండలంలో రైతులు వేసుకున్న రూ. 30 లక్షల పైప్‌లైన్ ధ్వంసం, గుంటూరులో చిరువ్యాపారి బడ్డీకొట్టు కబ్జా, విశాఖలో రైల్వే స్థలాల్లోని 250 కుటుంబాల ఇళ్ల తొలగింపు వంటి సమస్యలపై బాధితులు అర్జీలు అందించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పీతల సుజాత బాధితులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
250 మెట్లు ఎక్కి తాగునీరు మోయలేకపోతున్నాం.. కృష్ణా జిల్లా చిట్టినగర్ వాసుల ఆవేదన!
50 ఏళ్లుగా నివాసం ఉంటున్నా ఇళ్లు కూల్చేస్తున్నారు.. ఆదుకోవాలంటూ విశాఖ కార్మికుల ఆర్జీ!
అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరిస్తాం.. బాధితులకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పీతల సుజాత భరోసా!
Mangalagiri: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో బాధితులు తరలివచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్న వేధింపులు, భూ రికార్డుల అవకతవకలు, స్థానిక దౌర్జన్యాలు మరియు మౌలిక వసతుల కొరతపై నేతలకు నేరుగా విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్‌పర్సన్ పీతల సుజాత పాల్గొని ప్రజల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు.
రీసర్వేతో భూ రికార్డుల్లో తీవ్ర గందరగోళం – నెల్లూరు రైతుల ఆవేదన
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూముల రీసర్వే కారణంగా తమ భూ రికార్డులు తారుమారయ్యాయని నెల్లూరు జిల్లా జలదంకి మండలం తిమ్మసముద్రం రైతు టి. వెంకట సురేశ్ ఫిర్యాదు చేశారు. గత రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 40-1లో జయలక్ష్మి పేరిట ఉన్న 234 సెంట్ల భూమిని.. 2023 రీసర్వే తర్వాత వేరే వ్యక్తి పేరిట నమోదు చేశారని ఆరోపించారు. అనుభవంలో లేని వ్యక్తుల పేర్లను రికార్డుల్లో చేర్చడంతో అసలైన రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, రెవెన్యూ అధికారులు తక్షణమే క్షేత్రస్థాయి విచారణ జరిపి న్యాయం చేయాలని వేడుకున్నారు.
రూ. 30 లక్షల పైప్‌లైన్ ధ్వంసం – డోన్ రైతుల కన్నీరు
వర్షాభావం వల్ల బోర్లు ఎండిపోవడంతో పండ్ల తోటలు, పంటలను రక్షించుకోవడానికి నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తకోట రైతులు రూ. 30 లక్షలు సొంతంగా ఖర్చు చేసి ఏనుగుమర్రి చెరువు నుంచి పైప్‌లైన్ ఏర్పాటు చేసుకున్నారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా వంక మధ్యలో పైప్‌లైన్ వేసినప్పటికీ, కొందరు కావాలనే అభ్యంతరం చెబుతూ ఇటీవల పైప్‌లైన్, స్టార్టర్ బాక్సులను ధ్వంసం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు అందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నందున విధ్వంసకారులపై చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని కోరారు.
మహిళా చిరువ్యాపారిపై దౌర్జన్యం – బడ్డీకొట్టు కబ్జా
గుంటూరు నెహ్రూ నగర్, సీతానగరం రైల్వే గేట్ సమీపంలో గత పదేళ్లుగా కూరగాయల బడ్డీకొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న షానిక్ హసనాభి అనే మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. లేబర్ లైసెన్స్ చెల్లిస్తూ చిరువ్యాపారం చేసుకుంటున్న తనపై ఓ వ్యక్తి దాడి చేసి, దుర్భాషలాడి బలవంతంగా బడ్డీకొట్టును లాక్కున్నాడని వాపోయారు. జీవనాధారమైన తన దుకాణాన్ని తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని గ్రీవెన్స్‌లో వేడుకున్నారు.
కొండప్రాంత వాసుల నీటి కష్టాలు – విశాఖ బాధితుల నివాస రక్షణ
ఎన్టీఆర్ జిల్లా చిట్టినగర్ కొండపై నివసించే తోట వసంత కుమారి వినతిపత్రం సమర్పిస్తూ.. రోజూ 250 మెట్లు ఎక్కుతూ తాగునీరు పైకి తీసుకెళ్లడానికి తీవ్ర అవస్థలు పడుతున్నామని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. అలాగే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జ్ఞానాపురం ఎర్రగెడ్డ 41వ వార్డులో 50 ఏళ్లుగా రైల్వే స్థలంలో అద్దె చెల్లిస్తూ చేతివృత్తులు చేసుకుంటున్న సుమారు 250 కుటుంబాలను ఖాళీ చేయిస్తున్నారని, ఇప్పటికే కొన్ని ఇళ్లను కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆశ్రయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
సమస్యల పరిష్కారానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భరోసా
భూ సమస్యలు, మౌలిక వసతుల కొరతతో పాటు పెన్షన్లు, రేషన్ కార్డులు, ఉపాధి అవకాశాలు మరియు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఆర్థిక సాయం కోరుతూ పలువురు అర్జీలు సమర్పించారు. బాధితుల నుంచి వినతులను స్వీకరించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పీతల సుజాత మాట్లాడుతూ.. అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపి వేగంగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని వారు స్పష్టం చేశారు.
Be the first to react