ఆధ్యాత్మిక నగరం తిరుపతికి (Tirupati) మరో ప్రతిష్టాత్మక సంస్థ రానుంది. తిరుపతిలో భారీ స్థాయి రీసెర్చ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (AP FIRST) పేరుతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ సంస్థ ద్వారా తిరుపతి విద్యా, పరిశోధన రంగాల్లో కొత్త గుర్తింపు సాధించనుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు ఏరోస్పేస్, డిఫెన్స్, ఐటీ–డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ రంగాల నిపుణులు, సలహాదారులతో తన క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్తు, పరిశోధన రంగాల విస్తరణపై విస్తృతంగా చర్చించారు. యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
రాష్ట్ర యువత ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలను ముందుగా గుర్తించి, వాటికి అనుగుణంగా శిక్షణ ఇవ్వాలని సీఎం అధికారులకు సూచించారు. భవిష్యత్‌లో డిమాండ్ ఉన్న రంగాలపై దృష్టి పెట్టి యువతను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఆలోచనలో భాగంగానే ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన తిరుపతిలో అత్యాధునిక రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలిపారు.
ఇక రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడుతూ చంద్రబాబు, క్వాంటం టెక్నాలజీ, ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ, హెల్త్‌కేర్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలు రాబోయే కాలంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఈ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక పాలసీలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటు కూడా ప్రణాళికలో ఉందని వెల్లడించారు.
తిరుపతిలో ఏర్పాటు చేయనున్న AP FIRST రీసెర్చ్ కేంద్రం ఐఐటీ–ఐఐఎస్‌ఈఆర్ స్థాయి ప్రమాణాలతో ఉండనుందని సీఎం తెలిపారు. ఈ సంస్థ విద్యార్థులకు అవసరమైన అన్ని నైపుణ్యాలను అందించి, పరిశ్రమల అవసరాలకు తగిన మానవ వనరులను తయారు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్టాత్మక కేంద్రాన్ని సమర్థంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా తీసుకుంటామని చంద్రబాబు వెల్లడించారు.