Kollu Ravindra: అధికారంలో ఉంటే పలకరించరు.. పోతే డ్రామాలు ఆడతారు.. జగన్ వైజాగ్ టూర్‌పై కొల్లు రవీంద్ర ఫైర్!

Kollu Ravindra: ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసం చేసి, నట్టేట ముంచి, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పరామర్శల పేరుతో దొంగ నాటకాలు ఆడుతున్నారని వైసీపీ అధినేత జగన్ పై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అధికారంలో ఉంటే పలకరించరు.. పోతే డ్రామాలు ఆడతారు..
అధికారంలో ఉంటే పలకరించరు.. పోతే డ్రామాలు ఆడతారు..
  • విశాఖ పడవ ప్రమాద బాధితులకు 72 గంటల్లోనే రూ.10 లక్షల సాయం అందించిన ప్రభుత్వం..

  • Politics: వేట నిషేధ భృతిని రూ.20 వేలకు పెంచి అందించిన కూటమి సర్కార్..

Kollu Ravindra: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసం చేసి, నట్టేట ముంచి, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పరామర్శల పేరుతో దొంగ నాటకాలు ఆడుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర ఎక్సైజ్, యువజన సర్వీసుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సోమవారం నాడు ఏర్పాటు చేసిన అత్యవసర మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని మత్స్యకారుల కడుపు కొట్టి, వారి నోటికాడి కూడు లాక్కున్న జగన్ రెడ్డి.. ఇప్పుడు పెద్ద యోగ్యుడిలా బాధితులను పరామర్శిస్తానంటూ డ్రామాలు ఆడటం అత్యంత సిగ్గుచేటని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల విశాఖపట్నం సముద్ర తీరంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంపై కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించిందని, ప్రమాద సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నేవీ, కోస్ట్ గార్డ్ ప్రత్యేక రక్షణ బృందాలను రంగంలోకి దించి యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టామని రవీంద్ర వెల్లడించారు. ఈ ప్రమాదం నుంచి అద్భుతంగా ప్రాణాలతో బయటపడిన మత్స్యకారుడు చిన్నా అందించిన సమాచారంతో సముద్రంలో సుమారు 72 గంటల పాటు నిరంతరాయంగా గాలించినప్పటికీ మిగతా ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సముద్రంలో గల్లంతైన వారి కోసం నిర్వహించిన గాలింపు చర్యల అనంతరం కోస్ట్ గార్డ్, ప్రత్యేక త్రీ-మెన్ కమిటీ సమర్పించిన సాంకేతిక నివేదికల ఆధారంగా సదరు మత్స్యకారులు మరణించినట్లు ప్రభుత్వం అధికారికంగా నిర్ధారించిందని మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు. సాధారణంగా ఇలాంటి ప్రమాదాల్లో పరిహారం అందడానికి నెలల కాలం పడుతుందని, కానీ తమ కూటమి ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించి కేవలం 72 గంటల రికార్డు వ్యవధిలోనే బాధిత మత్స్యకార కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఆర్థిక సాయం తాలూకు చెక్కులను నేరుగా అందజేసిందని ఆయన స్పష్టం చేశారు.

భారతదేశ చరిత్రలోనే ఇంత వేగంగా, పారదర్శకంగా మత్స్యకారులకు సాయం అందించిన ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన సగర్వంగా ప్రకటించారు. అయితే, ఇలాంటి అత్యంత దురదృష్టకరమైన ప్రకృతి విపత్తు ఘటనను కూడా వైఎస్ జగన్ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూడటం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో బాధితులకు కొండంత ధైర్యాన్నిచ్చి ఆదుకుంటుంటే, జగన్ మాత్రం కేవలం శవ రాజకీయాలు చేయడానికే వైజాగ్ వెళ్తున్నారా అని ఆయన నిలదీశారు.

గతంలో వైజాగ్ హార్బర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా దాదాపు 45 మత్స్యకార బోట్లు కాలి బూడిదై మత్స్యకారులు రోడ్డున పడితే, అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా కనీసం వారిని పలకరించడానికి రాని జగన్, ఇప్పుడు అధికారంలో లేకపోయేసరికి పరామర్శల డ్రామాలు ఆడుతున్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు. జగన్ తన ఐదేళ్ల దౌర్భాగ్యపు పాలనలో సముద్రంలో వేటకు వెళ్లి 63 మంది మత్స్యకారులు గల్లంతై చనిపోతే, వారి కుటుంబాలకు కనీసం డెత్ సర్టిఫికెట్లు కూడా ఇప్పించలేకపోయారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయా బాధిత 63 మత్స్యకార కుటుంబాలను గుర్తించి, రూ. 3.15 కోట్ల భారీ సాయాన్ని అందించి ఆదుకున్నామని గుర్తుచేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మత్స్యకారులకు అన్ని విధాలా అండగా నిలుస్తోందని, అందులో భాగంగానే వేట నిషేధ భృతిని గతంలో ఉన్న మొత్తం కంటే ఏకంగా రూ. 20,000కి పెంచి, సుమారు రూ. 258 కోట్లకు పైగా నిధులను నేరుగా మత్స్యకారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశామని రవీంద్ర వివరించారు. మత్స్యకారుల సాంప్రదాయ చెరువుల హక్కులను కాలరాసేందుకు జగన్ ప్రభుత్వం గతంలో తెచ్చిన దుర్మార్గపు జీవో నెం. 217ను తాము తక్షణమే రద్దు చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలకు సైతం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ వాటాను ఇవ్వకుండా కేంద్ర నిధులను నిర్వీర్యం చేసిన అపకీర్తి జగన్కే దక్కుతుందని ఎద్దేవా చేశారు.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హుద్హుద్ తుపాను వచ్చిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలోనే ఉండి, దెబ్బతిన్న ప్రతి బోటుకు రూ. 6 లక్షల చొప్పున పరిహారం అందించి వేలాది మంది ఆక్వా రైతులను, మత్స్యకారులను నిలబెట్టారని కొల్లు రవీంద్ర గుర్తుచేశారు. మత్స్యకారుల ప్రాణ రక్షణ కోసం సముద్రంలో సిగ్నల్స్ అందేలా 4,560 అత్యాధునిక శాటిలైట్ ట్రాన్స్పాండర్లను కూటమి ప్రభుత్వం ఉచితంగా అందించిందని, అలాగే రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన 9 అత్యాధునిక ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని అత్యంత వేగవంతం చేశామని స్పష్టం చేశారు.

జువ్వలదిన్నె వంటి సున్నితమైన ప్రాంతాల్లో కావాలనే కులాల మధ్య, వర్గాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని వైఎస్సార్సీపీ చూస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. తన ఐదేళ్ల పాలనా కాలంలో మత్స్యకారుల సంక్షేమానికి ఏం చేశారో దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని జగన్ మోహన్ రెడ్డికి మంత్రి కొల్లు రవీంద్ర సవాల్ విసిరారు. రాష్ట్రంలో మత్స్యకారులకు ఏ మంచి జరిగినా, సామాజిక భద్రత లభించినా అది కేవలం తెలుగుదేశం మరియు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఆయన పునరుద్ఘాటించారు.

Tags

Be the first to react

Latest