ఉత్తర కొరియా అధ్యక్షుడు (President of North Korea) కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) కుమార్తె కిమ్ జు యే మరోసారి బహిరంగంగా కనిపించడం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కిమ్ జోంగ్ ఉన్, ఆయన భార్య రీ సోల్ జు, కుమార్తె జు యే కలిసి ప్యాంగ్యాంగ్‌లోని ప్రముఖ ‘కుముసన్ సన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్’ (Kumusan Sun Palace of the Sun) స్మారకాన్ని సందర్శించారు.
ఈ స్మారకంలో ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సుంగ్, మాజీ నేత కిమ్ జోంగ్ ఇల్ భౌతిక అవశేషాలు ఉన్నాయి. అక్కడ కుటుంబంతో కలిసి నివాళులు అర్పించిన జు యే దృశ్యాలను ప్రభుత్వ మీడియా ప్రత్యేకంగా ప్రచారం చేయడం గమనార్హం. చిన్న వయసులోనే దేశ అత్యంత పవిత్రంగా భావించే కార్యక్రమంలో పాల్గొనడం ఆమెకు ఇచ్చే ప్రాధాన్యతను సూచిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గత మూడేళ్లుగా కిమ్ జు యే తన తండ్రితో కలిసి పలు కీలక ప్రభుత్వ, సైనిక కార్యక్రమాల్లో పాల్గొంటూ కనిపిస్తున్నారు. ముఖ్యంగా క్షిపణి ప్రయోగాలు, సైనిక పరేడ్‌లు, ఆయుధాల ప్రదర్శనల వంటి కార్యక్రమాల్లో ఆమె తండ్రి పక్కనే నిలబడడం అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఉత్తర కొరియా లాంటి దేశంలో నాయకుడి కుటుంబ సభ్యులు బహిరంగంగా కనిపించడం చాలా అరుదు. అలాంటి పరిస్థితుల్లో చిన్న వయసులోనే జు యేను తరచూ ప్రజల ముందు చూపించడం వెనుక వ్యూహాత్మక ఆలోచన ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ఉత్తర కొరియా అధికార మీడియా జు యేను “గౌరవనీయ కుమార్తె గా, సంబోధిస్తూ కథనాలు ప్రచురిస్తోంది. గతంలో కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె గురించి ఒక్కసారి కూడా అధికారికంగా ప్రస్తావించలేదు. కానీ ఇటీవల ఆమె పేరు, హోదా లాంటి అంశాలు మీడియా ద్వారా బయటకు రావడం వారసత్వ సంకేతాలుగా భావిస్తున్నారు. కిమ్ కుటుంబంలో అధికారం తరతరాలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. కిమ్ ఇల్ సుంగ్ నుంచి కిమ్ జోంగ్ ఇల్, ఆ తర్వాత కిమ్ జోంగ్ ఉన్ వరకు కుటుంబ పాలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో జు యేనే నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందన్న ఊహాగానాలు బలపడుతున్నాయి.
ఇటీవల చైనా పర్యటన సందర్భంగా కూడా జు యే కనిపించడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. చైనా ఉత్తర కొరియాకు అత్యంత కీలక మిత్రదేశం కావడంతో, అంతర్జాతీయ వేదికలపై ఆమెను పరిచయం చేయడమే లక్ష్యంగా కిమ్ జోంగ్ ఉన్ ముందడుగు వేస్తున్నాడని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు, జు యే ఇంకా చిన్నారే కావడంతో ఆమెను ఇప్పుడే అధికారిక వారసురాలిగా ప్రకటించడం తొందరపాటు అవుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే రాజకీయంగా ఆమెకు మానసికంగా, ప్రజల్లో గుర్తింపు పెంచేలా చేస్తున్న ప్రయత్నాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మొత్తంగా చూస్తే, కిమ్ జు యే బహిరంగ కార్యక్రమాల్లో తరచూ పాల్గొనడం ఉత్తర కొరియా రాజకీయ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలకు దారి తీస్తోంది. ఇది కేవలం కుటుంబ కార్యక్రమమా, లేక అధికార వారసత్వానికి సిద్ధం చేసే ప్రక్రియలో భాగమా అన్నది ఇప్పటికీ స్పష్టతకు రాలేదు. అయినప్పటికీ, కిమ్ కుమార్తె ప్రతి బహిరంగ హాజరు ప్రపంచ రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తూ, ఉత్తర కొరియా నాయకత్వ భవిష్యత్తుపై చర్చలను మరింత ఉధృతం చేస్తోంది.