కృత్రిమ మేధ ఆటోమేషన్ పేరుతో బ్యాంకులు చేపడుతున్న మార్పులు ఒకవైపు వేగం, సమర్థతను పెంచుతున్నా… మరోవైపు లక్షలాది మంది ఉద్యోగుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఇటీవల వెలువడిన అంచనాల ప్రకారం, రాబోయే ఐదేళ్లలో యూరప్‌లో రెండు లక్షలకుపైగా బ్యాంకింగ్ ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంఖ్య కేవలం ఊహాగానమే కాదని, పెద్ద బ్యాంకులు ఇప్పటికే తీసుకుంటున్న నిర్ణయాలే చెబుతున్నాయి. ఖర్చులు తగ్గించుకోవడం, లాభాలను పెంచుకోవడం, పోటీని ఎదుర్కోవడం వంటి కారణాలతో బ్యాంకులు మానవ శ్రమకు బదులుగా యంత్రాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి.
ప్రత్యేకంగా బ్యాక్‌ఆఫీస్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ఈ ప్రభావం ఎక్కువగా పడే సూచనలు కనిపిస్తున్నాయి. లావాదేవీల పర్యవేక్షణ, డేటా ఎంట్రీ, నివేదికల తయారీ, రిస్క్ అంచనాలు వంటి పనులు ఇప్పటివరకు వేల మందికి ఉపాధిని కల్పించాయి. అయితే ఇవే పనులు ఇప్పుడు ఏఐ సాఫ్ట్‌వేర్‌లతో క్షణాల్లో పూర్తవుతున్నాయి. ఒకప్పుడు గంటల తరబడి పట్టే ప్రక్రియలు ఇప్పుడు కొన్ని నిమిషాల్లోనే ముగుస్తుండటంతో ఉద్యోగుల అవసరం తగ్గుతోంది.
యూరప్‌లోని కొన్ని ప్రముఖ బ్యాంకులు ఇప్పటికే తమ సిబ్బంది తగ్గింపు ప్రణాళికలను బహిరంగంగా ప్రకటించాయి. డిజిటలైజేషన్ పేరుతో శాఖలను విలీనం చేయడం, ఫిజికల్ బ్రాంచ్‌ల సంఖ్యను తగ్గించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయి. “కస్టమర్ ఇప్పుడు బ్రాంచ్‌కు రావాల్సిన అవసరం లేదు, యాప్ చాలు” అన్న ఆలోచన బ్యాంకుల వ్యూహంలో కీలకంగా మారింది. దీని ఫలితంగా కౌంటర్ల వద్ద, ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల అవసరం క్రమంగా తగ్గుతోంది.
ఇది యూరప్‌కే పరిమితం కాని సమస్యగా మారుతోంది. అమెరికా సహా ఇతర దేశాల్లోనూ బ్యాంకులు ఇదే దారిలో సాగుతున్నాయి. ఏఐ ఆధారిత వ్యవస్థలతో ఖాతాదారుల ఆన్‌బోర్డింగ్, రుణాల ప్రాసెసింగ్, నిబంధనల అమలు వంటి పనులు సులభంగా జరుగుతున్నాయి. అయితే ఈ సౌలభ్యం వెనుక ఉద్యోగ కోతల వాస్తవం దాగి ఉంది.
నిపుణులు మరో కోణాన్ని కూడా చూపిస్తున్నారు. ఏఐ వల్ల పూర్తిగా ఉద్యోగాలు పోతాయని కాకుండా, ఉద్యోగాల స్వరూపమే మారుతుందని వారు అంటున్నారు. డేటా విశ్లేషణ, టెక్నాలజీ నిర్వహణ, ఏఐ పర్యవేక్షణ వంటి కొత్త పాత్రలు ఏర్పడతాయని చెబుతున్నారు. కానీ సమస్య ఏంటంటే… ఇప్పటివరకు సంప్రదాయ బ్యాంకింగ్ పనులు చేస్తున్న వారికి ఈ కొత్త నైపుణ్యాలు ఎంతమేర అందుబాటులోకి వస్తాయన్నదే.