కొత్త ఏడాది సందర్భంగా ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన వినియోగదారులకు ఉపయోగపడే శుభవార్త చెప్పింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక కీలక సదుపాయాన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే వాయిస్ ఓవర్ వైఫై లేదా సాధారణంగా చెప్పుకునే వైఫై కాలింగ్ సేవ. మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్ సరిగా అందని ప్రాంతాల్లోనూ, కేవలం వైఫై కనెక్షన్ ఉంటే చాలు కాల్స్ చేయగలిగేలా ఈ సదుపాయం పనిచేస్తుంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి ఇది ఎంతో ఊరట కలిగించే అంశంగా మారనుంది.
బీఎస్ఎన్ఎల్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, దేశంలోని అన్ని టెలికాం సర్కిల్స్‌లో ఈ వై-ఫై కాలింగ్(VoWiFi) సేవను ప్రారంభించారు. ఇప్పటివరకు సిగ్నల్ బలహీనంగా ఉండే ఇళ్లలో, బహుళ అంతస్తుల భవనాల్లో, బేస్‌మెంట్‌లలో కాల్స్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న వినియోగదారులకు ఇక ఆ సమస్యలు తగ్గనున్నాయి. వైఫై కనెక్షన్ ఉన్నచోట ఎక్కడైనా నాణ్యమైన వాయిస్ కాల్స్ చేయవచ్చు. అంతేకాదు, ఈ సేవ ద్వారా కేవలం కాల్స్ మాత్రమే కాకుండా ఎస్ఎంఎస్ సందేశాలను కూడా పంపే అవకాశం ఉందని సంస్థ వెల్లడించింది.
ఈ కొత్త ఫీచర్‌ను ఆధునిక ఐఎంఎస్ సాంకేతికత ఆధారంగా అభివృద్ధి చేసినట్లు బీఎస్ఎన్ఎల్ అధికారులు తెలిపారు. దీనిని ఉపయోగించేందుకు ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఫోన్ సెట్టింగ్స్‌కి వెళ్లి, నెట్‌వర్క్ లేదా కనెక్షన్స్ విభాగంలో ఉన్న వైఫై కాలింగ్ ఆప్షన్‌ను ఆన్ చేస్తే సరిపోతుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ సేవను బీఎస్ఎన్ఎల్ పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. అదనపు ఛార్జీలు లేకుండా, ప్రస్తుతం ఉన్న ప్లాన్‌లతోనే ఈ సదుపాయం పొందవచ్చు.
నెట్‌వర్క్ కవరేజ్ పూర్తిగా లేని పరిస్థితుల్లో కూడా స్పష్టమైన వాయిస్ కాల్స్ చేయగలిగేలా ఈ ఫీచర్ రూపొందించబడింది. పెద్ద భవనాలు, మందపాటి గోడలు, భూగర్భ ప్రాంతాలు వంటి చోట్ల సెల్యులార్ సిగ్నల్స్ సరిగా అందకపోయినా, వైఫై ఉంటే చాలు కాల్ క్వాలిటీ మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు, సెల్యులార్ నెట్‌వర్క్‌పై ఉండే రద్దీ కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉందని టెలికాం వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇటీవల కాలంలో బీఎస్ఎన్ఎల్ తన సేవలను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 4జీ నెట్‌వర్క్ విస్తరణతో పాటు, వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచే సాంకేతిక ఫీచర్లను వరుసగా ప్రవేశపెడుతోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) గురించి విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం గత సంవత్సరం నవంబర్ నెలలో బీఎస్ఎన్ఎల్ లక్షలాది కొత్త వినియోగదారులను ఆకర్షించింది. ఇది ప్రభుత్వరంగ సంస్థపై ప్రజల్లో మళ్లీ నమ్మకం పెరుగుతున్నదానికి నిదర్శనంగా భావిస్తున్నారు.