కొత్త ఏడాది 2026 సందర్భంగా ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) తన ఖాతాదారులకు ఒక అద్భుతమైన వార్తను అందించింది. చాలా కాలంగా వినియోగదారులు ఎదురుచూస్తున్న వాయిస్-ఓవర్-వైఫై (VoWiFi) లేదా 'వైఫై కాలింగ్' సేవలను దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల ప్రైవేట్ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియాలకు బీఎస్‌ఎన్‌ఎల్ గట్టి పోటీని ఇవ్వనుంది.
ఈ టెక్నాలజీ అంటే ఏమిటి? ఇది సామాన్యులకు ఎలా ఉపయోగపడుతుంది? అనే పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం….
అసలు VoWiFi అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది?
సాధారణంగా మనం ఫోన్ కాల్స్ మాట్లాడాలంటే మొబైల్ టవర్ నుండి సిగ్నల్ ఉండాలి. కానీ, VoWiFi (Voice over WiFi) టెక్నాలజీతో మొబైల్ సిగ్నల్ లేకపోయినా, మీ ఇంట్లో లేదా ఆఫీసులో ఉన్న వైఫై నెట్‌వర్క్ ద్వారా కాల్స్ మాట్లాడుకోవచ్చు.
ఇంటర్నెట్ ఆధారిత కాల్స్: ఇది ఐపి మల్టీమీడియా సబ్‌సిస్టమ్ (IMS) అనే సాంకేతికతపై పనిచేస్తుంది. మీరు కాల్ చేసినప్పుడు, అది మొబైల్ టవర్ ద్వారా కాకుండా ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవుతుంది.
థర్డ్ పార్టీ యాప్స్ అక్కర్లేదు: దీని కోసం మీరు వాట్సాప్ లేదా టెలిగ్రామ్ వంటి ప్రత్యేక యాప్‌లను వాడాల్సిన అవసరం లేదు. మీ ఫోన్‌లోని సాధారణ డయలర్ నుండే కాల్స్ చేయవచ్చు.
నెంబర్ మారదు: మీ పాత మొబైల్ నెంబర్ నుండే కాల్స్ వెళ్తాయి, అవతలి వారికి కూడా మీ నెంబరే కనిపిస్తుంది. చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏమిటంటే.. ఇంటి లోపలి గదుల్లోకి వెళ్లినా లేదా ఆఫీసు బేస్‌మెంట్లలో ఉన్నా మొబైల్ సిగ్నల్ సరిగ్గా ఉండదు. వైఫై కాలింగ్ వల్ల సిగ్నల్ తక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా మాటలు చాలా స్పష్టంగా (HD Quality) వినిపిస్తాయి.
మీరు వైఫై నెట్‌వర్క్‌లో కాల్ మాట్లాడుతూ బయటకు వెళ్తే, ఆ కాల్ కట్ అవ్వకుండా ఆటోమేటిక్‌గా మొబైల్ నెట్‌వర్క్‌కు మారిపోతుంది. టెలికాం మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఈ సేవ ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో ఉండే వారికి ఎంతో మేలు చేస్తుంది. కొండ ప్రాంతాల్లో లేదా అడవి ప్రాంతాల్లో మొబైల్ టవర్లు తక్కువగా ఉంటాయి. అక్కడ బీఎస్‌ఎన్‌ఎల్ 'భారత్ ఫైబర్' (FTTH) లేదా ఇతర బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఉంటే చాలు, సిగ్నల్ లేకపోయినా నిరంతరాయంగా కాల్స్ మాట్లాడుకోవచ్చు.
ఎక్కువ మంది వైఫై కాలింగ్ వాడటం వల్ల మొబైల్ టవర్లపై ఒత్తిడి తగ్గి, నెట్‌వర్క్ నాణ్యత పెరుగుతుంది. వినియోగదారులకు సంతోషాన్నిచ్చే విషయం ఏంటంటే.. ఈ సేవ పూర్తిగా ఉచితం. వైఫై కాల్స్ చేయడానికి బీఎస్‌ఎన్‌ఎల్ ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయదు. మీ ప్రస్తుత ప్లాన్ (వాయిస్ ప్యాక్) నుండే కాల్స్ కట్ అవుతాయి.
ప్రస్తుత కాలంలో వస్తున్న దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్లు డీఫాల్ట్‌గా VoWiFi సదుపాయాన్ని కలిగి ఉంటున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త సీఎండీ శ్రీ ఎ. రాబర్ట్ జె. రవి, నూతన సంవత్సర ప్రసంగంలో ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ.. 2026లో బీఎస్‌ఎన్‌ఎల్ అత్యున్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. 4G నెట్‌వర్క్‌ను విస్తరిస్తూనే, ఇలాంటి అత్యాధునిక సేవలను అందుబాటులోకి తేవడం బిఎస్‌ఎన్ఎల్ నెట్‌వర్క్ ఆధునికీకరణలో ఒక ముఖ్యమైన అడుగు.
చాలా ఫోన్లలో ఇది ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. ఒకవేళ కాకపోతే ఇలా చేయండి:
మీ ఫోన్ Settings లోకి వెళ్లండి.
SIM Card & Mobile Networks ఎంచుకోండి.
మీ బిఎస్‌ఎన్ఎల్ సిమ్‌పై క్లిక్ చేయండి.
కింద ఉండే Make Calls using Wi-Fi ఆప్షన్‌ను ఆన్ (Toggle on) చేయండి.
వైఫై కనెక్ట్ అయినప్పుడు మీ ఫోన్ టాప్ బార్‌లో వైఫై కాలింగ్ చిహ్నం (Icon) కనిపిస్తుంది.
బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వినియోగదారులకు ఊరటనిస్తుంది. ముఖ్యంగా 'భారత్ ఫైబర్' వాడుతున్న వారికి ఇక సిగ్నల్ సమస్య అనే మాటే ఉండదు. ప్రభుత్వ రంగ సంస్థ అయినా, ప్రైవేట్ సంస్థలతో పోటీ పడుతూ ఇలాంటి ఫీచర్లు తేవడం శుభపరిణామం.