భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నెక్స్ట్-జనరేషన్ కియా సెల్టోస్ అధికారికంగా లాంచ్ అయింది. ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ.10.99 లక్షలుగా కియా ఇండియా ప్రకటించింది. ఇది కేవలం ఫేస్‌లిఫ్ట్ కాకుండా, డిజైన్, సైజ్, టెక్నాలజీ, భద్రతా ప్రమాణాల్లో గణనీయమైన మార్పులతో వచ్చిన పూర్తిస్థాయి కొత్త తరం ఎస్‌యూవీగా నిలుస్తోంది. ఈ వాహనాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంట్‌లో తయారు చేయడం విశేషం. భారతీయ వినియోగదారుల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ మోడల్, మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీని మరింత పెంచనుంది.
కొత్త సెల్టోస్‌ను కియా గ్లోబల్ K3 ప్లాట్‌ఫామ్పై నిర్మించారు. భారత మార్కెట్‌లో ఈ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించడం ఇదే తొలిసారి. పాత మోడల్‌తో పోలిస్తే దీని పొడవు 95 మిమీ, వెడల్పు 30 మిమీ, వీల్‌బేస్ 80 మిమీ పెరిగింది. దీని వల్ల క్యాబిన్‌లో ఎక్కువ లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ లభిస్తుంది. కియా ‘Opposites United’ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా రూపొందించిన ఈ ఎస్‌యూవీకి ముందు వైపు డిజిటల్ టైగర్ ఫేస్, ఐస్-క్యూబ్ LED హెడ్‌ల్యాంప్స్, స్టార్ మ్యాప్ LED DRLలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వెనుక వైపు కనెక్టెడ్ LED టెయిల్‌ల్యాంప్స్, కొత్త 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ దీన్ని మరింత ప్రీమియంగా చూపిస్తున్నాయి.
ఇంటీరియర్ విషయంలో కియా సెల్టోస్‌ను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లింది. 30-అంగుళాల ట్రినిటీ పనోరమిక్ డిస్‌ప్లే ఈ కారులో ప్రధాన ఆకర్షణ. ఇందులో 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 10-వే పవర్డ్ డ్రైవర్ సీటు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లు లగ్జరీ అనుభూతిని అందిస్తాయి. ఇంజిన్ ఆప్షన్లలో 1.5 లీటర్ న్యాచురల్ పెట్రోల్ (115hp), 1.5 లీటర్ టర్బో పెట్రోల్ (160hp), 1.5 లీటర్ డీజిల్ (116hp) ఉన్నాయి. మాన్యువల్ నుంచి DCT, ఆటోమేటిక్ వరకు విభిన్న గేర్‌బాక్స్ ఎంపికలు లభిస్తాయి.
భద్రత విషయంలో కియా రాజీ పడలేదు. అన్ని వేరియంట్లలోనూ 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్గా అందిస్తోంది. టాప్ వేరియంట్లలో లెవెల్-2 ADAS (21 ఫంక్షన్లు) అందుబాటులో ఉంది. ధరల విషయానికి వస్తే, కొత్త సెల్టోస్ HTE, HTK, HTX, GTX ట్రిమ్‌లతో పాటు X-Line టాప్ వేరియంట్‌లో లభిస్తుంది. ధరలు రూ.10.99 లక్షల నుంచి ప్రారంభమై రూ.19.99 లక్షల వరకు ఉన్నాయి. డిసెంబర్ నుంచి బుకింగ్‌లు కొనసాగుతుండగా, 2026 జనవరి మధ్య నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని కియా ప్రకటించింది. ఈ మోడల్‌తో హ్యుందాయ్ క్రెటా, గ్రాండ్ విటారా, హైరైడర్ వంటి వాహనాలకు గట్టి పోటీ ఎదురుకానుంది.