ఆంధ్రప్రదేశ్‌లో వార్డు సచివాలయాల వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న కొందరు వార్డు సచివాలయ కార్యదర్శుల హోదాల్లో మార్పులు చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వార్డు ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శుల హోదాను ఇకపై “వార్డు డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులు”గా మారుస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఇప్పటివరకు వార్డు వెల్ఫేర్, డెవలప్‌మెంట్ కార్యదర్శులుగా ఉన్నవారు ఇకపై “వార్డు వెల్ఫేర్, ఎడ్యుకేషన్ కార్యదర్శులు”గా వ్యవహరించనున్నారు. ఈ హోదాల మార్పుకు సంబంధించిన చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం లభించడంతో ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మార్పులతో వార్డు సచివాలయాల్లో బాధ్యతల పంపిణీ మరింత స్పష్టంగా మారనుంది. ముఖ్యంగా వార్డు డేటా ప్రాసెసింగ్ కార్యదర్శుల బాధ్యతల్లో డేటా సేకరణ, నిర్వహణ, విశ్లేషణకు అధిక ప్రాధాన్యత కల్పించనున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారుల వివరాల అప్‌డేషన్, డిజిటల్ రికార్డుల నిర్వహణలో వీరి పాత్ర కీలకంగా ఉండనుంది. మరోవైపు, వార్డు వెల్ఫేర్, ఎడ్యుకేషన్ కార్యదర్శుల పరిధిలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు విద్యకు సంబంధించిన అంశాలు కూడా చేరనున్నాయి. పాఠశాలల సమాచారం, విద్యార్థుల వివరాలు, ప్రభుత్వ విద్యా పథకాల అమలు వంటి అంశాలపై వీరు ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఈ మార్పుల వల్ల వార్డు సచివాలయాల పనితీరు మరింత మెరుగుపడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పరిపాలనా నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ, పట్టు, సహకార, మార్కెటింగ్ శాఖల ఎక్స్‌అఫిషియో స్పెషల్ సెక్రటరీగా ఉన్న బుడితి రాజశేఖర్ సేవలను ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. 2025లో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా, ఆయన సేవలను 2026 వరకు కొనసాగించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా ఈ పొడిగింపు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఆయనకు నెలకు రూ.3.50 లక్షల గౌరవ భృతిని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఆయన పశుసంవర్ధక, మత్స్యశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కీలక శాఖల్లో అనుభవం దృష్ట్యా ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
అదేవిధంగా పరిశ్రమల రంగంలో సంస్కరణలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ ప్రమాద ముప్పు (లో-హజర్డ్) కలిగిన పరిశ్రమలు ఇకపై తమ ఫైర్ సేఫ్టీ ఆడిట్‌లను ప్రభుత్వ గుర్తింపు పొందిన థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా చేయించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. థర్డ్ పార్టీ ఏజెన్సీల ఎంపిక, ఫైర్ ఎన్‌వోసీ జారీకి ముందు చేపట్టాల్సిన తనిఖీలు, గుర్తింపు కోసం దరఖాస్తు ప్రక్రియ వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ విడుదల చేశారు. ఈ కొత్త విధానం ద్వారా ఫైర్ సేఫ్టీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా, సమర్థవంతంగా మారనుందని ప్రభుత్వం ఆశిస్తోంది.