రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై ప్రశంసల జల్లు కురిపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని లాలాచెరువు నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తున్న మోటూరి మంగారాణి అంకితభావాన్ని, సేవా స్పూర్తిని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్య అందించవచ్చని తన కృషితో నిరూపిస్తున్న ఉపాధ్యాయురాలిగా మంగారాణిని లోకేశ్ కొనియాడారు.
తరగతి గదిలో పాఠాలు చెప్పడానికే పరిమితం కాకుండా, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా కొత్త పద్ధతులను అవలంబించడం మంగారాణి ప్రత్యేకతగా మంత్రి పేర్కొన్నారు. రైమ్స్, ఆటల ఆధారిత బోధన, స్ఫూర్తినిచ్చే కథలు, 3డి యానిమేషన్ వీడియోలతో పాఠాలను ఆసక్తికరంగా రూపొందించి, వాటిని ‘Mangarani Lessons’ అనే యూట్యూబ్ ఛానల్‌లో ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నారని తెలిపారు. ఈ ప్రయత్నాల ద్వారా ఒక్క తన పాఠశాలకే కాకుండా లక్షలాది మంది విద్యార్థులకు గణితాన్ని సులభంగా నేర్పుతున్నారని ప్రశంసించారు.
బోధనతో పాటు మానవత్వం కూడా ఉపాధ్యాయ వృత్తికి కీలకమని చాటిచెప్పిన ఉదాహరణగా మంగారాణి సేవలను లోకేశ్ ప్రస్తావించారు. ఇటీవల అదే పాఠశాలకు చెందిన విద్యార్థి సత్తి చరణ్ తేజ్ ప్రమాదానికి గురైనప్పుడు, తోటి ఉపాధ్యాయులతో కలిసి విరాళాలు సేకరించి బాలుడి వైద్య ఖర్చులకు అండగా నిలిచారని గుర్తుచేశారు. విద్యార్థుల భవిష్యత్తు పట్ల బాధ్యతతో వ్యవహరించే ఉపాధ్యాయులు సమాజానికి నిజమైన ఆదర్శమని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతగా గుర్తింపు పొందిన మంగారాణి, టెక్స్ట్‌బుక్ రైటర్‌గా, టీచర్ ట్రైనర్‌గా కూడా విశేష సేవలందిస్తున్నారని లోకేశ్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని పెంచుతూ, విద్యలో నాణ్యతను చాటిచెబుతున్న మంగారాణి వంటి ఉపాధ్యాయుల కృషితోనే ‘ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్’ లక్ష్యం సాకారం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల అంకితభావమే రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది అని లోకేశ్ స్పష్టం చేశారు.