ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల (బీసీలు) కోసం మరో కీలక సంక్షేమ నిర్ణయం తీసుకుంది. సొంత ఇళ్లలో సౌర విద్యుత్ (సోలార్) యూనిట్లు ఏర్పాటు చేసుకునే బీసీ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.20 వేల రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 11న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది బీసీ కుటుంబాలకు ప్రత్యక్ష లాభం చేకూరనుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ సౌర విద్యుత్ యూనిట్ల ఏర్పాటు ద్వారా బీసీ కుటుంబాలపై ఉన్న విద్యుత్ బిల్లుల భారం గణనీయంగా తగ్గనుంది. అంతేకాకుండా, పర్యావరణ హితమైన పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని మరింత ప్రోత్సహించినట్లవుతుంది. బీసీ జనాభా అధికంగా ఉన్న జిల్లాల్లో ఈ పథకం ద్వారా ఎక్కువ మందికి ప్రయోజనం కలగనుందని అధికారులు చెబుతున్నారు. దీని వల్ల బీసీల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటంతో పాటు, దీర్ఘకాలికంగా విద్యుత్ ఖర్చులు తగ్గే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఈ పథకం అమలుకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు త్వరలోనే విడుదల కానున్నాయి.
ప్రస్తుతం అమలులో ఉన్న ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజన కింద ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రెండు కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ యూనిట్లను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ఎటువంటి ఖర్చు లేకుండా సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునే అవకాశం పొందుతున్నాయి. అదే పథకం బీసీ వర్గాలకూ వర్తిస్తుంది. అయితే, బీసీలకు కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.20 వేల సబ్సిడీ అందించనుంది. దీని ద్వారా బీసీ కుటుంబాలకు మొత్తం రూ.80 వేల వరకు ఆర్థిక సహాయం లభించనుంది.
ఇక మూడు కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ యూనిట్ ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వం ఇప్పటికే రూ.78 వేల రాయితీ ఇస్తోంది. ఈ యూనిట్ ఏర్పాటు ఖర్చు సుమారు రూ.2.20 లక్షలు కాగా, రాయితీ పోగా మిగిలిన మొత్తానికి బ్యాంకు రుణం సులభంగా పొందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ముందుగా ఇంటి అవసరాలకు వినియోగించుకోవచ్చు. అదనంగా మిగిలిన విద్యుత్తును విద్యుత్ పంపిణీ సంస్థ గ్రిడ్‌కు విక్రయించి అదనపు ఆదాయం కూడా పొందవచ్చు. నియోజకవర్గానికి సుమారు 10 వేల సోలార్ యూనిట్లు కేటాయించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అర్హులైన బీసీ కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వ రాయితీలతో సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.