Political: అసలు ఏం జరిగింది?
యూరప్ దేశాల అభ్యంతరం
ఆర్టికల్ 5 ప్రమాదంలో పడిందా
Trump Miami: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. నాటో కూటమి విషయంలో ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో యూరప్ దేశాలు తమకు అండగా నిలబడటం లేదని, అలాంటప్పుడు తాము మాత్రం నాటో కోసం ఎందుకు కష్టపడాలని ఆయన ప్రశ్నించారు.
శుక్రవారం రాత్రి మయామిలో జరిగిన ఒక ఇన్వెస్ట్‌మెంట్ ఫోరంలో ట్రంప్ మాట్లాడారు. ఇరాన్‌పై అమెరికా జరుపుతున్న దాడులకు దాదాపు నాలుగు వారాలు కావస్తున్నా, యూరప్ దేశాల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. "మేము ఎప్పుడూ వారి కోసం ముందుంటాం.. కానీ ఇప్పుడు వారు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే, ఇకపై మేము నాటోలో ఉండాల్సిన అవసరం లేదనిపిస్తోంది" అని ట్రంప్ స్పష్టం చేశారు.
గత నెలలో ఇరాన్‌పై దాడి చేయాలనే నిర్ణయం తీసుకునేటప్పుడు అమెరికా తమను సంప్రదించలేదని యూరప్ దేశాలు వాదిస్తున్నాయి. ఈ యుద్ధం వల్ల అనవసరమైన ఉద్రిక్తతలు పెరుగుతాయని పలు దేశాల నేతలు ఇప్పటికే వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయితే, దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. "వారు మాకు అండగా లేనప్పుడు, వారి రక్షణ కోసం మేము ఎందుకు ఉండాలి? ఇది బ్రేకింగ్ న్యూస్ లాగా అనిపించవచ్చు, కానీ ఇదే నిజం" అని కుండబద్దలు కొట్టారు.
నాటో నిబంధనల ప్రకారం 'ఆర్టికల్ 5' అనేది చాలా కీలకం. దీని ప్రకారం కూటమిలోని ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా, అది అన్ని దేశాలపై జరిగిన దాడిగానే భావించి అందరూ కలిసి పోరాడాలి. కానీ ట్రంప్ వ్యాఖ్యలు చూస్తుంటే, అమెరికా ఈ నిబంధన నుంచి తప్పుకునేలా కనిపిస్తోంది. గతంలో కూడా ట్రంప్ గ్రీన్లాండ్ కొనుగోలు విషయంపై డెన్మార్క్‌తో, ఇతర రక్షణ ఖర్చుల విషయంలో యూరప్ దేశాలతో గొడవ పడిన సంగతి తెలిసిందే.
ఒకవైపు ఇరాన్ యుద్ధం తీవ్రమవుతుండటం, మరోవైపు నాటో కూటమిలో చీలికలు రావడం ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. ఇదే సమయంలో ట్రంప్.. క్యూబా విషయంలో కూడా కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రస్తుతం అమెరికా తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి.