భారత నౌకాదళం తన రక్షణ సామర్థ్యాలను మరింత శక్తివంతం చేస్తూ మరో ఆధునిక యుద్ధనౌకను తమ అమ్ములపొదిలో చేర్చుకుంది. శత్రు జలాంతర్గాములను గుర్తించి ధ్వంసం చేయడమే లక్ష్యంగా రూపొందించిన ‘మాహె’ శ్రేణిలో తొలి నౌక ఐఎన్ఎస్ మాహెను నేడు లాంఛనంగా ప్రవేశపెట్టడం దేశ సముద్ర భద్రతకు పెద్ద బలాన్ని చేకూర్చింది. యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో-వాటర్ క్రాఫ్ట్ (ASW–SWC) శ్రేణికి చెందిన ఈ నౌక తీర ప్రాంతాల్లో అత్యంత కచ్చితత్వంతో ఆపరేషన్లు నిర్వహించే సామర్థ్యంతో ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. ‘సైలెంట్ హంటర్’ పేరుతో ప్రసిద్ధి పొందిన ఈ నౌక, శత్రు కదలికలను రహస్యంగా, వేగంగా గుర్తించే శక్తితో తీరరక్షణలో కీలకపాత్ర పోషించనుంది.
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా 80 శాతం కంటే ఎక్కువ స్వదేశీ సాంకేతికతతో ఈ నౌక నిర్మించబడింది. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) ఆధునిక నౌకా నిర్మాణ పద్ధతులతో దీన్ని తయారు చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా భారత నౌకా రంగం ఏ మేరకు అభివృద్ధి చెందిందో స్పష్టమవుతోంది. సాంకేతిక వ్యవస్థల అనుసంధానం, సముద్ర రక్షణ రంగంలో నైపుణ్యాలు, తీర ప్రాంతానికి సన్నిహితంగా ఉండే ఇరుకైన జలాల్లో వేగంగా కదలగలగడం వంటి లక్షణాలు ఈ నౌకను ప్రత్యేకతతో నిలబెట్టాయి. పెద్ద నౌకలు వెళ్లలేని లోతు తక్కువ ప్రాంతాల్లో ఇది అత్యంత చురుగ్గా పనిచేసేలా డిజైన్ చేయడం దేశీయ నౌక నిర్మాణ ప్రతిభకు నిదర్శనం.
ఐఎన్ఎస్ మాహె సామర్థ్యాలపరంగా కూడా విశేషంగా నిలుస్తోంది. 78 మీటర్ల పొడవు, 1,100 టన్నుల బరువు సామర్థ్యంతో కూడిన ఈ నౌక గంటకు 25 నాట్ల గరిష్ఠ వేగాన్ని అందుకోగలదు. ఒకసారి ఇంధనం నింపుకుంటే 1,800 నాటికల్ మైళ్ల దూరం వరకూ ప్రయాణించి, 14 రోజుల పాటు నిరంతరాయంగా గస్తీ వ్యవహారాలు నిర్వహించగలదు. దీని లోపల అమర్చిన ఇంటిగ్రేటెడ్ కంబాట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, మీడియం-ఫ్రీక్వెన్సీ సోనార్, మల్టీ-ఫంక్షన్ రాడార్, తేలికపాటి టార్పెడోలు, మల్టీ-రోల్ రాకెట్ లాంచర్లు, రిమోట్ కంట్రోల్డ్ 30 ఎంఎం గన్ వంటి అధునాతన ఆయుధ వ్యవస్థలు ఏ జలాంతర్గామినైనా ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకోవడానికి సహాయపడతాయి. మైన్‌లను అమర్చే ప్రత్యేక రైళ్లు కూడా ఉండటం దీన్ని బహుళ విధుల్లో ఉపయోగించే యుద్ధ నౌకగా నిలబెడుతుంది.
ప్రాంతంలోని 'మాహె' పేరును ఈ నౌకకు పెట్టడం విశేషం. అలాగే కలరిపయట్టు యుద్ధ కళలో వినియోగించే ‘ఉరుమి’ అనే వంగే కత్తి బొమ్మను దీని చిహ్నం మీద ముద్రించడం ప్రతీకాత్మకంగా నిలిచింది. ఇది నౌక యొక్క చురుకుదనం, కచ్చితత్వం, ప్రాణాంతక శక్తిని సూచిస్తుంది. ఈ శ్రేణిలో మొత్తం ఎనిమిది నౌకలను నౌకాదళం ఆర్డర్ చేయగా, ఐఎన్ఎస్ మాహె మొదటిది. మిగతా నౌకలు 2027 నాటికి నేవీలో చేరనున్నాయి. ఇవన్నీ విధుల్లోకి చేరిన తర్వాత పాత అభయ్-క్లాస్ కార్వెట్ల స్థానాన్ని భర్తీ చేసి, హిందూ మహాసముద్రం సహా వ్యూహాత్మక తీర మండలాల్లో భారత జలాంతర్గామి వేట సామర్థ్యాన్ని మరింత శక్తివంతం చేయనున్నాయి.