హైదరాబాద్‌లో ఐబొమ్మ కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇప్పటికే ఐదో రోజు పోలీసులు ఐబొమ్మ రవిని కస్టడీలో ఉంచి ప్రశ్నిస్తున్నారు. ప్రతి రోజు కొత్త కోణాలను బయటకు తీస్తూ దర్యాప్తును మరింత విస్తరిస్తున్న పోలీసులు, రవి సమాధానాల్లో స్పష్టత లేకపోవడంతో కఠిన ప్రశ్నలు వేస్తున్నట్లు సమాచారం. తొలి రోజు విచారణలో సర్వర్ల స్థానం, యాప్‌లతో ఉన్న అనుబంధం, డేటాబేస్ కనెక్షన్లు వంటి సాంకేతిక అంశాలపై అధికారులు ప్రశ్నలు అడిగారు. అయితే రవి ఇస్తున్న వివరాలు అస్పష్టంగా ఉండటంతో మరిన్ని ఆధారాలను అతని ముందు ఉంచి పోలీసులు వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.
రెండో రోజు విచారణలో SBI ఇన్సూరెన్స్ సర్వీసెస్ పేరుతో సినిమాలకు సంబంధించి ఉన్న ఫైల్‌లు, కాపీరైట్ ఉల్లంఘన, డిజిటల్ రైట్స్ మేనేజ్‌మెంట్ (DRM) ఉల్లంఘనలు ప్రధాన ప్రశ్నలుగా నిలిచాయి. రవి ఉపయోగించిన ఈ అకౌంట్లు ఎలా సృష్టించబడ్డాయి? సినిమాలు ఎలా అప్‌లోడ్ అయ్యాయి? ఎవరి సహాయంతో ఇది సాగింది? అనే అంశాలపై దృష్టి సారించారు. మూడో రోజు రవి పనిచేసిన నెట్‌వర్క్ వ్యవస్థలపై, ముఖ్యంగా IP అడ్రస్‌లు, VPN వినియోగం, ప్రాక్సీ సర్వర్లు, విదేశాల నుంచి వచ్చిన ట్రాఫిక్ మరియు సాంకేతిక సహకారం వంటి అంశాలపై పోలీసులు సమగ్రంగా విచారణ నిర్వహించారు.
నాలుగో రోజు విచారణలో అధికారులు రవితో ఆర్థిక లావాదేవీలపై మరిన్ని వివరాలు కోరారు. ముఖ్యంగా విదేశీ పేమెంట్ గేట్వేలు, క్రిప్టోకరెన్సీ వాలెట్లు, అంతర్జాతీయ బ్యాంక్ లావాదేవీలు, పేమెంట్ పార్ట్నర్‌షిప్‌లు, అలాగే నెట్‌వర్క్‌ను విదేశాల్లో ఎలా నిర్వహించారన్న అంశాలపై ప్రశ్నలు అడిగారు. రవికి విదేశాల్లో ఇతర సహాయకుడు ఉన్నాడా? సర్వర్లు ఎవరి పేరుతో రిజిస్టర్ అయ్యాయి? అన్న దానిపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
ఇటీవలి విచారణలో ER Infotech పేరుతో నమోదైన డొమెయిన్‌లు, వాటి PURCHASE HISTORY వాటి యాజమాన్యం, మరియు ఆ కంపెనీ అడ్రస్ నిజమా లేదా కేవలం కవర్ నేమ్ మాత్రమేనా అన్న దానిపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. రవి అనేక ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వని కారణంగా దర్యాప్తు అధికారులు అతను సహకరించడం లేదని పేర్కొంటున్నారు.
పోలీసులు సేకరించిన డిజిటల్ ఫోరెన్సిక్ డేటా, సర్వర్ లాగ్స్, బ్యాంక్ రికార్డులు మరియు అంతర్జాతీయ డిజిటల్ హోస్టింగ్ కంపెనీల సమాచారం ఆధారంగా రాబోయే రోజుల్లో మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసు ఇంకా అనేక మలుపులు తిరగనుందని, అవసరమైతే మరిన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశముందని సమాచారం.