ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గతంలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (EWS) రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. మొత్తం కోటాలో 10 శాతం రిజర్వేషన్‌ను ఈడబ్ల్యూఎస్ వర్గానికి కేటాయిస్తూ ప్రత్యేక చట్టం చేసింది. అయితే ఈ కోటా పరంగా ఏ వర్గాలు అర్హులు అన్న అంశంపై చాలాకాలంగా వివాదాలు, సందేహాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా "ఈడబ్ల్యూఎస్ అంటే కేవలం అగ్రకులాల్లోని పేదలకేనా?" లేక "అన్ని కులాల్లోనూ ఆర్థికంగా వెనుకబడిన వారికి వర్తించాలా?" అనే ప్రశ్నలపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ కేంద్రాన్ని క్లారిటీ ఇవ్వాలని కోరింది. అగ్రకులాల్లోని పేదలకు మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తుందా? లేక ఇతర కులాల్లోనూ ఆర్థికంగా వెనుకబడిన వారికి అవకాశం ఉన్నదా? అనే ప్రశ్నలను నేరుగా ఉంచింది. ఈ విషయంపై అడ్వకేట్స్ యూనియన్ ఫర్ డెమోక్రసీ అండ్ సోషల్ జస్టిస్ అనే సంస్థ పబ్లిక్ ఇన్టరెస్ట్ లిటిగేషన్ (PIL) దాఖలు చేసింది. తమ పిటిషన్‌లో ఇతర కులాల్లోని పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తించడం లేదని, కేవలం జనరల్ కేటగిరీ పేదలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు.
ఈ పిటిషన్‌ను పరిశీలించిన మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ రవి విజయమలిమత్, జస్టిస్ విశాల్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల వ్యవధిలో ఈడబ్ల్యూఎస్ అర్హత ప్రమాణాలపై పూర్తి స్పష్టతతో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. రిజర్వేషన్ల వ్యవస్థలో ఆర్థిక పారామితులను అందరికీ సమానంగా వర్తింపచేయాలంటే అసలు చట్టం ఏమి చెప్పింది? కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల్లో ఏ స్పష్టత ఉంది? అన్న విషయాలను కోర్టు తెలుసుకోవాలని సూచించింది.
పిటిషనర్లు తమ వాదనలో ప్రభుత్వం పేదలపై కులం ఆధారంగా వివక్ష చూపుతున్నదని, అన్ని కులాల్లోనూ ఆర్థికంగా వెనుకబడిన వాళ్లను సమానంగా చూడాలని కోరారు. కేవలం అగ్రకులాల్లోని పేదలకే ఈడబ్ల్యూఎస్ వర్తింపజేయడమే సరైందా? అనే ప్రశ్నను కోర్టు ముందుకు తీసుకురావడంతో, ఈ అంశంపై జాతీయస్థాయిలో మరోసారి చర్చ మొదలైంది. కేంద్రం ఈదర్లో ఇచ్చే వివరణే భవిష్యత్తులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ల పరిధిని నిర్ణయించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.