Politics- 76వ ఏట అడుగుపెడుతున్న బాబు.. ఆత్మకూరులో పండుగ వాతావరణం.
రాజగోపురం సెట్, ప్రత్యేక హోమాలు.. సీఎం జన్మదినానికి ఆత్మకూరు ముస్తాబు!
చంద్రబాబు నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష.. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.
CBN Birthday Celebrations: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 20న ఆత్మకూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా వేడుకలు నిర్వహించనున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. నెల్లూరుపాళెం - ఆత్మకూరు రోడ్డులోని ఏఎంసీ (AMC) మైదానంలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక రాజగోపురం సెట్, హోమగుండాలు మరియు ఇతర ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విభజిత ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న దార్శనికుడు చంద్రబాబు అని కొనియాడారు. ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నిలబడిన ధీరోదాత్తుడు ఆయనని అభివర్ణించారు.
ముఖ్యమంత్రి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రానికి సుపరిపాలన అందించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ వేద పండితులతో ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలను ఒక పండుగలా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులన్నీ సమాయత్తం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. బూత్ కమిటీల నుండి మండల కమిటీల వరకు ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొని, గ్రామ గ్రామాన ప్రజలను ఈ వేడుకలకు ఆహ్వానించాలని దిశానిర్దేశం చేశారు.
ఇదే సందర్భంలో మంత్రి ఆనం కీలక రాజకీయ పరిణామాలను ప్రస్తావించారు. అమరావతిని శాశ్వత రాజధానిగా నిలబెట్టిన ఘనత చంద్రబాబుదేనని ఆయన స్పష్టం చేశారు. అలాగే, మహిళా బిల్లు చట్టరూపం దాల్చబోతోందని, ఇందుకోసం యువనేత నారా లోకేష్ ఢిల్లీలో ఎన్డీఏ కూటమి తరఫున ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఎన్టీఆర్ హయాంలో మహిళలకు ఆస్తి హక్కు కల్పిస్తే, ఇప్పుడు మహిళా బిల్లు అమలులో టీడీపీ ప్రధాన పాత్ర పోషించడం గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి నేతలందరూ ఈ విజయోత్సాహంతో జన్మదిన వేడుకల్లో పాల్గొనాలని కోరారు.